|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 09:31 PM
వెనిజులా గడ్డపై అమెరికా జరిపిన మెరుపు దాడి అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పతనం కావడంతో.. అక్కడ ఇన్నాళ్లూ ఆశ్రయం పొందిన కొలంబియా గెరిల్లా కమాండర్లు ఇప్పుడు ప్రాణభయంతో పారిపోతున్నారు. వెనిజులాను సురక్షిత స్థావరంగా మార్చుకున్న నిషేధిత సాయుధ ముఠాలు ఇప్పుడు సరిహద్దులు దాటి ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కొలంబియా సాయుధ దళాల వర్గాలు వెల్లడించాయి.
గెరిల్లా స్థావరాలపై దెబ్బ
నేషనల్ లిబరేషన్ ఆర్మీ వంటి శక్తివంతమైన సమూహాలు, అంతరించిపోయిన ఫార్క్ గెరిల్లా సైన్యానికి చెందిన విభాగాలు వెనిజులాలో సురక్షితంగా జీవిస్తున్నాయని కొలంబియా ప్రభుత్వం చాలా కాలంగా అనుమానిస్తోంది. సరిహద్దు వెంబడి సాగే కొకైన్ అక్రమ రవాణా మార్గాలను నియంత్రించే ఈ గ్రూపులకు నికోలస్ మదురో అండదండలు ఉండేవని భద్రతా నిపుణులు చెబుతున్నారు. మదురో ప్రభుత్వం పతనం కావడంతో తమకు రక్షణ కరువైందని భావించిన గెరిల్లా నేతలు.. ఇప్పుడు తిరిగి కొలంబియాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మదురోను అమెరికా ప్రత్యేక దళాలు బంధించిన్యూయార్క్ కోర్టుకు తరలించిన నేపథ్యంలో.. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. గెరిల్లా ముఠాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన కొలంబియా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 2,200 కిలో మీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి వేల సంఖ్యలో సైనికులను మోహరించింది. ముఖ్యంగా సరిహద్దు నగరమైన కుకుటాలో సైన్యం గట్టి నిఘా ఉంచింది. గెరిల్లాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ దాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దమ్ముంటే వచ్చి నన్ను తీసుకెళ్లమంటూ పెట్రో సవాల్
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. ఎలాంటి ఆధారాలు చూపకుండానే పెట్రోను 'డ్రగ్ లార్డ్' (మాదక ద్రవ్యాల డాన్) అని పిలుస్తూ.. జాగ్రత్తగా ఉండాలని ట్రంప్ హెచ్చరించారు. దీనికి పెట్రో కూడా అదే స్థాయిలో స్పందించారు. గతంలో తాను గెరిల్లాగా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తిని అని గుర్తు చేస్తూ.. మాతృ భూమి కోసం ఎలాంటి ఆయుధాలు పట్టడానికైనా తాను సిద్ధమే అని సవాల్ విసిరారు. ఈ పరిణామాలన్నీ లాటిన్ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
Latest News