|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 06:24 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన ఆయన, అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని ప్రధానంగా విజ్ఞప్తి చేశారు.పోలవరం ప్రాజెక్టు పర్యటనను ముగించుకుని నేరుగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టబలం కల్పించాలని కోరారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని ఆయన వివరించారు.అలాగే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన 'జీ-రామ్-జీ' పథకంలోని నిబంధనలపైనా చంద్రబాబు చర్చించారు. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడం వల్ల, ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంలో ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు.ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న సహకారానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా మద్దతును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కూడా ఇరువురు నేతలు సమీక్షించుకున్నారు.
Latest News