|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 08:03 PM
కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య (దివ్య స్పందన) సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సాధారణంగా సామాజిక అంశాలపై గళం విప్పే ఆమె, ఈసారి పురుషులను కుక్కలతో పోలుస్తూ చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కల దాడికి సంబంధించిన ఒక కేసు విచారణలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. "కుక్క ఎప్పుడు కరిచే మూడ్‌లో ఉంటుందో ఎవరూ ఊహించలేరని, ప్రమాదకరంగా మారిన వాటిని షెల్టర్ హోమ్స్‌కు తరలించడమే మంచిదని" ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ రమ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.
కోర్టు వ్యాఖ్యలను పురుషులకు అన్వయిస్తూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. "మగాళ్ల మైండ్‌ను కూడా ఎవరూ చదవలేరు.. వారు ఎప్పుడు రేప్ లేదా మర్డర్ చేస్తారో ఎవరికీ తెలియదు. మరి అలాంటప్పుడు పురుషులందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టాలా?" అంటూ ఆమె ప్రశ్నించారు. కుక్కల ప్రవర్తనను పురుషుల నేర ప్రవృత్తితో పోలుస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
రమ్య చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నేరస్తులను శిక్షించడంలో తప్పు లేదు కానీ, అందరు మగాళ్లను నేరస్తుల్లా చూడటం సరికాదని హితవు పలుకుతున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి సాధారణీకరణ వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.