|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 06:26 AM
తెలుగు సంస్కృతి, సినిమా, సాహిత్యం, కళలు, రుచుల సమ్మేళనంగా విజయవాడలో ‘అమరావతి-ఆవకాయ ఫెస్టివల్ 2026’ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పున్నమిఘాట్‌లోని ప్రధాన వేదికపై మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా నదిలో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ బోట్లను కూడా ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి దేవతల రాజధాని అని, వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎంత బాధపడినా అమరావతిని దేశంలోనే బెస్ట్ సిటీగా, డైనమిక్ సిటీగా తీర్చిదిద్ది తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడను అత్యంత పరిశుభ్రమైన నగరంగా అమరావతిని పచ్చని నగరంగా హామీ ఇచ్చారు. కృష్ణా నది ఒడ్డున గంట సేపు గడిపితే ఎలాంటి ధ్యానం అవసరం లేదని, అంతటి ప్రశాంతత ఇక్కడ ఉందని ఆయన పేర్కొన్నారు.గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో పండుగలు, సంబరాలు కనుమరుగై ప్రజల ముఖాల్లో నవ్వులు కరవయ్యాయని చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడలో విజయ ఉత్సవ్, దసరా వేడుకలను ప్రపంచస్థాయిలో నిర్వహించామని గుర్తుచేశారు. ఒకప్పుడు దసరా అంటే మైసూరు, కలకత్తా గుర్తుకొచ్చేవని, ఇప్పుడు విజయవాడ పేరు వినిపించేలా చేశామని అన్నారు. ఆవకాయ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుందని, భారతదేశంలో ఫుడ్ అంటే ఆంధ్రప్రదేశ్ అనే స్థాయికి మన వంటకాల ఖ్యాతి ఉందని కొనియాడారు.తెలుగు సినిమా వైభవాన్ని ప్రస్తావిస్తూ, ‘భక్త ప్రహ్లాద’ నుంచి ‘బాహుబలి’ వరకు తెలుగు చిత్రసీమ ఎన్నో శిఖరాలను అధిరోహించిందని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్‌బాబు వంటి మహానటులు కృష్ణా జిల్లా నుంచే వచ్చి చిత్రసీమకు దిక్సూచిగా నిలిచారని, నేడు పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి వారు దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. సంపద సృష్టిలో, వ్యాపార చతురతలో కృష్ణా జిల్లా ప్రజలు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు.రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ, విశాఖపట్నాన్ని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతామని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా ఇళ్లలోనే గ్యాస్ తయారుచేసుకునే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని, పర్యాటకం, సాంకేతికతతో మరిన్ని ఉద్యోగాలు సృష్టిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఉత్సవాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత విజయవాడ ప్రజలదేనని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేనిశివనాథ్ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు.
Latest News