|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 01:13 PM
సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన తర్వాత డిసెంబర్ నాటికే చాలా మందికి రీఫండ్ డబ్బులు జమ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది సాంకేతిక కారణాల వల్ల రీఫండ్ ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఐటీ శాఖ పోర్టల్‌లో అప్‌డేట్లు రావడం, డేటా ప్రాసెసింగ్‌లో వేగం పెరిగినప్పటికీ, కొన్ని అంతర్గత సాంకేతిక ఇబ్బందుల వల్ల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కేవలం సాంకేతిక సమస్యలే కాకుండా, పన్ను చెల్లింపుదారులు చేసే కొన్ని పొరపాట్లు కూడా రీఫండ్ ఆగిపోవడానికి ప్రధాన కారణమవుతాయి. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాను ఆదాయపు పన్ను పోర్టల్‌లో ముందే 'వాలిడేట్' (Pre-validate) చేయకపోవడం వల్ల డబ్బులు జమ కావు. అలాగే, రిటర్నులు దాఖలు చేసిన తర్వాత 30 రోజులలోపు ఇ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఒకవేళ మీరు రిటర్నులు సబ్మిట్ చేసి, వెరిఫై చేయకుండా వదిలేస్తే మీ ఫైలింగ్ చెల్లదు, ఫలితంగా రీఫండ్ కూడా రాదు.
మరికొన్ని సందర్భాల్లో ఐటీ రిటర్నుల ఫారంలో ఇచ్చిన వివరాలు, మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో సరిపోలకపోతే ఐటీ శాఖ వాటిని నిలిపివేస్తుంది. తప్పుడు మినహాయింపులు (Deductions) కోరడం లేదా ఆదాయ వివరాలను తక్కువగా చూపడం వంటివి చేస్తే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ ఫారంలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటేనే నోటీసు వస్తుంది కానీ, అంతా సరిగ్గా ఉండి కేవలం ఆలస్యమవుతుంటే మాత్రం టెన్షన్ పడక్కర్లేదు. మీ వివరాలను అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతి ఇస్తారు.
ప్రస్తుతం మీ రీఫండ్ స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వడం మంచిది. అక్కడ 'రీఫండ్ ఇష్యూడ్' అని ఉండి కూడా డబ్బులు రాకపోతే బ్యాంకు వివరాలను సరిచూసుకోవాలి. అలా కాకుండా 'అండర్ ప్రాసెస్' అని ఉంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఐటీ శాఖ అంతర్గత తనిఖీలు (Internal Checking) పూర్తి కాగానే, నేరుగా మీ రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి. అప్పటివరకు ఓపిక పట్టడం ఉత్తమం.