|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 08:21 PM
తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన అవతార్ గ్రూప్ అనే ప్రముఖ వర్క్‌ప్లేస్ ఇంక్లూజన్ సంస్థ 2025 ఏడాదికి గానూ దేశంలోని వివిధ నగరాలపై.. పలు అంశాలపై అధ్యయనం నిర్వహించింది. ఈ తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2025లో భారతదేశంలో మహిళలు నివసించడానికి, పనిచేయడానికి అత్యంత అనుకూలమైన నగరంగా కర్ణాటక రాజధాని బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఈ రిపోర్ట్‌లో మొత్తం దేశంలోని 125 నగరాలను విశ్లేషించి.. సిటీ ఇంక్లూజన్ స్కోర్ (సీఐఎస్) ఆధారంగా ఆయా నగరాలకు అవతార్ గ్రూప్ ర్యాంకులను కేటాయించారు.
మొత్తం స్కోరులో 53.29 పాయింట్లతో మొదటి స్థానంలో బెంగళూరు నిలిచింది. ఆ తర్వాత 49.86 పాయింట్లతో చెన్నై రెండో స్థానంలో నిలిచింది. ఇక టాప్ -5లో ఉన్న పుణె (46.27).. హైదరాబాద్ (46.04).. ముంబై (44.49) వరుసగా నిలిచాయి. ప్రధానంగా రెండు అంశాల మీద ఆధారపడి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఒకటి సామాజిక భద్రత, జీవన ప్రమాణాలను కొలిచే సోషల్ ఇంక్లూజన్ స్కోర్.. రెండోది ఉద్యోగ అవకాశాలు, పని వాతావరణాన్ని కొలిచే ఇండస్ట్రియల్ ఇంక్లూజన్ స్కోర్.
మహిళల భద్రత, ప్రభుత్వ సేవలు, విద్య, ఆరోగ్య సదుపాయాల విషయంలో చెన్నై నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే.. బలమైన కార్పొరేట్ వ్యవస్థ, స్టార్టప్‌లు, విస్తృతమైన ఉద్యోగ అవకాశాల కారణంగా బెంగళూరు పారిశ్రామిక విభాగంలో అగ్రస్థానంలో నిలిచి ఓవరాల్‌గా నంబర్ 1 నగరంగా మారింది. హైదరాబాద్, పుణె నగరాలు అటు సామాజిక భద్రతలోనూ.. ఇటు ఉద్యోగ అవకాశాలలోనూ సరైన సమతుల్యతను కలిగి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది.
ఈ నివేదికలోని మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. టాప్ 10 నగరాల జాబితాలో దక్షిణ భారతదేశం నుంచి.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, కోయంబత్తూర్ అనే 5 నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇది దక్షిణ భారత్‌లో మహిళలకు ఉన్న సురక్షితమైన, వృద్ధిదాయకమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి.. గురుగ్రామ్ ఒక్కటే 6వ స్థానంలో నిలిచి టాప్ 10 నగరాల జాబితాలో చేరింది.