|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 08:37 PM
ఇరాన్‌లో 13వ రోజు ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలకు సూచనలు చేసే ముందు సొంత దేశంపై దృష్టి సారించాలని హితవు పలికారు. దేశంలోని ఆందోళనకారులకు సైతం ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మల్లా వ్యవహరించే వారిని సహించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాధ్యక్షుడిని సంతోషపెట్టేందుకు సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారని ఇరాన్ ఆందోళనకారులను ఉద్దేశించి అన్నారు. సొంత దేశంలో అశాంతిని రగిలించేందుకు పాశ్చాత్య శక్తులకు కొందరు వంత పాడుతున్నారని ఆయన విమర్శించారు.ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లావి ఇచ్చిన పిలుపు మేరకు ఇరాన్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దేశంలో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు నిలిపివేసినప్పటికీ ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ స్పందించారు.
Latest News