|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 02:05 PM
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుసగా అపశృతులు చోటుచేసుకుంటుండటంపై వెంటనే శుద్ధి కార్యక్రమం నిర్వహించాలని వైసీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ఆలయ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ప్రచారంపై చూపిస్తున్న శ్రద్ధ ఆలయ పవిత్రతను కాపాడడంలో ఎందుకు కనిపించడం లేదని ఈవోను ఉద్దేశించి పోతిన మహేశ్ ప్రశ్నించారు. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వరుస ఘటనలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టాలని, వైదిక కమిటీ, సెక్యూరిటీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. తనిఖీలు గాలికి వదిలేశారా? అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా పోతిన పలు అంశాలను ప్రస్తావించారు. అమ్మవారి ఆలయంలో కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల అమ్మవారికి చీకట్లోనే నైవేద్యం సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అలాగే అన్న ప్రసాదంలో పనిచేసే కార్మికులకు రోజువారి వేతనం తక్కువగా చెల్లిస్తున్నారని, దీనిపై వారు ఆలయంలోనే ఆందోళనకు దిగిన ఘటనను గుర్తు చేశారు. విశిష్ట పూజలకు ఉపయోగించే పాలల్లో పురుగులు కనిపించడం, అమ్మవారి గర్భగుడికి అతి సమీపంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో వరుసగా అపచారాలు, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అవినీతే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కనకదుర్గ ఆలయంలో కమిషనర్ కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించినా, ఈవో మాత్రం కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అలాగే తిరుమలలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదేపదే అపశృతులు జరుగుతున్నాయని పోతిన అన్నారు. మద్యం, మాంసాహారం, చెప్పులతో ఆలయ ప్రాంగణంలోకి రావడం, తొక్కిసలాటలు, ప్రాణనష్టం వంటి ఘటనలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అటు, టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆలయ అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజీనామా చేయడం, తిరుమలలో పరిస్థితి ఎలా ఉందో హిందూ భక్తులకు అర్థమయ్యేలా చేస్తోందని పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు.
Latest News