|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 09:25 PM
దేశవ్యాప్తంగా ఎంతో ఆలస్యం అయిన జనగణన ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన జనగణన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంగా ప్రారంభమైంది. ఈ జనాభా లెక్కల సేకరణలో పలు కీలక మార్పులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొత్తంగా రెండు దశల్లో జనగణన నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో హౌస్ లిస్టింగ్ చేయనుండగా.. రెండో దశలో జనాభా లెక్కలను సేకరించనున్నారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు తొలి దశ నిర్వహించనుండగా.. అందులో హౌస్ లిస్టింగ్ అంటే ఇళ్ల వివరాలను సేకరిస్తారు. రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి వరకు జనాభా లెక్కల సేకరణ అంటే జనగణన పూర్తిస్థాయిలో జరుగుతుంది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా, సబ్ డివిజనల్, సబ్ జిల్లా స్థాయిలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. కేవలం జనాభానే కాకుండా ఇళ్లు, వ్యవసాయం, సంస్కృతి, వ్యాపారం, వృత్తులు వంటి కీలక సమాచారాన్ని కూడా అధికారులు నమోదు చేయనున్నారు.
జనగణన చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. జనగణన చేసే అధికారుల విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపింది. జనగణన అధికారుల విధులను అడ్డుకున్నా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా చట్టపరంగా చర్యలు తప్పవని పేర్కొంది. అటువంటి వారికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సరైన సమాచారం అందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ప్రజలు సహకరించాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
Latest News