|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 10:52 PM
రష్యా చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా, వెనిజులా చమురును ఒక ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మార్చింది. అమెరికా పర్యవేక్షణలో జరిగే ఈ చమురు వాణిజ్యం వల్ల భారత్‌కు ఇంధన భద్రత లభించడమే కాకుండా.. అమెరికా విధించబోయే భారీ సుంకాల (500 శాతం) నుంచి రక్షణ లభించనుంది. ఇది భారత్, అమెరికా మధ్య కుదిరిన ఒక గొప్ప దౌత్యపరమైన విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వెనిజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక వ్యూహాత్మక మలుపుగా మారింది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను తగ్గించుకోవాలని ఒత్తిడి చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం.. దానికి ప్రత్యామ్నాయంగా ఈ అవకాశాన్ని భారత్ ముందు ఉంచింది.
అమెరికా పర్యవేక్షణలో కొత్త వ్యవస్థ
వెనిజులా చమురును భారత్‌కు నేరుగా కాకుండా.. అమెరికా ప్రభుత్వం నియంత్రించే ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా విక్రయించనున్నారు. ఈ చమురు అమ్మకం ద్వారా వచ్చే డబ్బు అమెరికా కంట్రోల్‌లో ఉన్న బ్యాంకు అకౌంట్లలోకి వెళ్తుంది. ఆ నిధులను వెనిజులా ప్రజల సంక్షేమం కోసం మాత్రమే వినియోగించనున్నారు. అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్టోఫర్ రైట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చమురును అమెరికా ప్రభుత్వమే నేరుగా మార్కెట్ చేస్తుంది.
భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై 500 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించేలా రూపొందించిన శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ భారీ జరిమానాల నుంచి భారత్ తప్పించుకోవాలంటే రష్యాకు బదులుగా వెనిజులా చమురు ఒక ఉత్తమ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
భారతీయ చమురు దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే వెనిజులా నుంచి చమురు కొనడానికి ఆసక్తి చూపుతోంది. వెనిజులా నుంచి వచ్చే హెవీ క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేసే సామర్థ్యం రిలయన్స్, కొన్ని ప్రభుత్వ రంగ రిఫైనరీలైన ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్ ఉంది. రిలయన్స్ తన జామ్‌నగర్ రిఫైనరీకి జనవరిలో రష్యా నుంచి ఎటువంటి చమురు రావడం లేదని ఇప్పటికే ప్రకటించింది.