|
|
by Suryaa Desk | Sun, Jan 11, 2026, 06:07 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా ఇటీవల నియమితులైన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు శనివారం నాడు సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసిన ఆయన, తనకు సలహాదారుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంతెన సత్యనారాయణ రాజుకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రకృతి వైద్య రంగంలో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకున్న అనుభవాన్ని వినియోగించుకోవాలని భావించిన ప్రభుత్వం, ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ డిసెంబర్ 29న అధికారికంగా ఉత్తర్వులు చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, డాక్టర్ రాజు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించిన విధానాలపై ప్రభుత్వానికి డాక్టర్ రాజు సలహాలు, సూచనలు అందించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి సిద్ధమైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై విస్తృతంగా ప్రచారం చేస్తూ మంతెన సత్యనారాయణ రాజు విశేష ప్రజాదరణ పొందారు. ఆయన అమరావతి సమీపంలో ‘మంతెన ఆరోగ్యాలయం’ పేరుతో ప్రకృతి చికిత్సాలయం, పరిశోధన కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Latest News