బెంగళూరు ట్రాఫిక్ పుణ్యమా అని 8 కేజీలు తగ్గా! .. బెంగళూరు టెకీ వెయిట్ లాస్ జర్నీ
 

by Suryaa Desk | Sat, Jan 24, 2026, 09:03 PM

ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండే నగరాల్లో బెంగళూరు ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులకు నరకం చూపించే ఈ సిటీ, ఓ వ్యక్తికి మాత్రం చాలా మేలు చేసింది. బెంగళూరు ట్రాఫిక్ అతడి జీవితాన్ని ఊహించని రీతిలో మార్చింది. ట్రాఫిక్ పుణ్యమా అని అతడు ఏకంగా 8 కేజీల బరువు తగ్గాడు. అసలు ఇది ఎలా సాధ్యమైందో వివరిస్తూ అతడు చేసిన పోస్ట్‌పై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..


సదరు వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. అతడు ఆఫీసుకు వెళ్లడం కోసం ప్రతిరోజూ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ నుంచి కోరమంగళకు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆఫీసుకు చేరుకోవడానికి అతడికి దాదాపు 90 నిమిషాల సమయం పట్టేది. దీనివల్ల అతడు తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాడు. ఆఫీసులో ఎక్కువ సమయం కూర్చోవడం, ఇంటికి వెళ్లాక అలసిపోవడం వల్ల వ్యాయామం చేయడానికి అస్సలు సమయం దొరికేది కాదు.


దీని గురించి అతడు చెబుతూ.. "ఈ ప్రయాణం వల్ల నేను తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనేవాడిని. తినడానికి కూడా సరిగ్గా సమయం దొరికేది కాదు. ఆఫీసుకు వెళ్లాక ఆదరాబాదరాగా నా డెస్క్ దగ్గరే తినేవాడిని. ఇంతసేపు ప్రయాణం చేయడం వల్ల నాకు వ్యాయామం చేసే ఓపిక కానీ, సమయం కానీ ఉండేవి కావు" అన్నాడు.


"ఈ ట్రాఫిక్ నరకం నుంచి తప్పించుకోవడానికి నేను కొన్ని మార్పులు చేసుకున్నాను. వారంలో మూడు రోజులు ఇంటి నుంచే పని చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఉదయాన్నే ఇంటి దగ్గర ఉన్న జిమ్‌కు వెళ్లేవాడిని. అలాగే, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం మానేసి, దగ్గర్లోని రెస్టారెంట్లకు నడిచి వెళ్లేవాడిని" అని చెప్పుకొచ్చాడు.


బెంగళూరు ట్రాఫిక్ మారలేదు కానీ, సదరు టెకీ జీవనశైలి మారింది. ఈ మార్పుల వల్ల అతడి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. అతడి 'రెస్టింగ్ హార్ట్ రేట్' (విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగం) 82 నుంచి 64కు తగ్గిందట. అంతేకాదు, పెద్దగా కష్టపడకుండానే దాదాపు 8 కిలోల బరువు తగ్గానని వెల్లడించాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. "ట్రాఫిక్ మెరుగుపడలేదు, అందుకే నేను దానితో పోరాడటం మానేశాను. ఫలితంగా నా జీవితమే మారిపోయింది."


ఈ పోస్ట్ సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కొందరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వల్ల తమ ఆరోగ్యం ఎలా మెరుగుపడిందో చెప్పారు. ఒక యూజర్ స్పందిస్తూ.. "నేను ఒక సంవత్సరం పాటు బస్సులో ప్రయాణించాను. ప్రయాణంలో రెండు స్టాప్‌లు మారాల్సి వచ్చేది. ఒకవైపు ప్రయాణానికి 45 నిమిషాలు పట్టేది. ఆ సమయంలో నేను చాలా ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది" అని రాశారు.


అయితే మరికొందరు మాత్రం.. అతడు బరువు తగ్గింది ట్రాఫిక్ వల్ల కాదని, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్లేనని అభిప్రాయపడుతున్నారు. ఆఫీసుకు వెళ్లే అవసరం లేకపోవడం వల్లే ఆ సమయాన్ని జిమ్‌కు కేటాయించగలిగారని, ప్రయాణ ఒత్తిడి తగ్గడం వల్లే ఆరోగ్యంగా మారారని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా బెంగళూరు వంటి నగరాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంత అవసరమో ఈ కథనం మరోసారి నిరూపించిందని వారు పేర్కొంటున్నారు.

Latest News
Sensex, Nifty drop over 1 pc over heightened Middle East tensions Mon, Mar 02, 2026, 11:32 AM
Gold, silver prices jump 3 pc as safe haven demand grows amid Israel-Iran war Mon, Mar 02, 2026, 11:25 AM
PM Modi meets Canadian counterpart Mark Carney at Hyderabad House Mon, Mar 02, 2026, 11:20 AM
Sexual assault case filed against 'Manjummel Boys' Director Chidambaram in Kerala's Kochi Mon, Mar 02, 2026, 11:13 AM
TN BJP targets CM Stalin for not receiving PM Modi during his visit Mon, Mar 02, 2026, 11:06 AM