|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 09:03 PM
బంగ్లాదేశ్‌లో మైనార్టీలు ముఖ్యంగా హిందువుల హత్యాకాండలు ఆగడం లేదు. తాజాగా, మరో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్యారేజ్‌లో నిద్రపోతున్న యువకుడ్ని సజీవ దహనం చేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 50 కిలోమీట్లర దూరంలో నార్సింగ్డి ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తాజా ఘటనతో బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రతపై ఆందోళనలు అధికమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కుమిల్లా జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఖొకాన్ చంద్ర భౌమిక్ కుమారుడు 23 ఏళ్ల చంచల్ చంద్ర భౌమిక్ నార్సింగ్డి పట్టణంలోని ఖానాబరీ మసీదు మార్కెట్ ప్రాంతంలోని గ్యారేజ్‌లో పనిచేస్తున్నాడు.
శుక్రవారం రాత్రి తన పని ముగించుకున్న భౌమిక్.. అలసిపోయి గ్యారేజ్ లోపలే నిద్రపోయాడు. ఇంతలో అల్లరి మూక షట్టర్ మూసివేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. దీంతో నిద్రిస్తున్న చంచల్ భౌమిక్ మంటల్లో కాలిబూడిదయ్యాడు. అతడు చనిపోయాడని ధ్రువీకరింకుకున్న తర్వాతే దుండగులు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
చంచల్ భౌమిక్ తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోగా.. తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. అతడి సంపాదనపైనే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. గ్యారేజీలో గత ఆరేళ్లుగా అతడు పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. గ్యారేజ్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కుట్రదారులను గుర్తించి, అరెస్ట్ చేయడానికి గాలింపు కొనసాగుతుంది. వివిధ బృందాలను ఏర్పాటుచేసినట్టు అధికారులు తెలిపారు.
పక్కా పథకం ప్రకారమే దుండుగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాధిత కుటుంబం, గ్యారేజ్ యజమాని ఆరోపిస్తున్నారు. గతేడాది డిసెంబరులో దీపు చంద్రదాస్, ఖోకొన్ దాస్ అనే వ్యక్తులను కూడా అల్లరిమూక ఈ విధంగా హత్య చేసిన విషయం తెలిసిందే. గతవారం రాజ్‌బరి జిల్లాలో బంకులో పెట్రోల్ పోయించుకుని డబ్బులు అడిగినందుకు హిందూ యువకుడ్ని కారుతో తొక్కి చంపి పారిపోయారు. బంగ్లాదేశ్ జనాభాలో దాదాపు 8 శాతంగా ఉన్న హిందువులు.. ప్రస్తుతం భయం భయంగా బతుకుతున్నారు. అక్కడ హిందువులపై జరుగుతోన్న వరుస దాడులతో వారి భద్రతపై భారత్ పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. బంగ్లాదేశ్‌లో మైనార్టీల పరిస్థితి అత్యంత దుర్బరంగా మారింది.
Latest News