|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 04:45 PM
విజయవాడ దుర్గమ్మ దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే దుర్గమ్మ ఆలయం విషయంలో సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారంతో ఇంద్రకీలాద్రిపై హడావిడి కనిపిస్తోంది. కొందరు భక్తులు చేస్తున్న పనులు ఆలయ అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద ఇటీవల రెండు సంఘటనలు చర్చనీయాంశం అయ్యాయట. ఎవరో ఒకసారి స్వామి సోషల్ మీడియాలో చెప్పిన మాటలు విని.. హైదరాబాద్ నుంచి వెయ్యి మంది భక్తులు విజయవాడ దుర్గమ్మ గుడికి వచ్చారట. తాము ఎక్కడ పారాయణం చేయాలో చెప్పాలని.. తమకు మైక్, దర్శనం, భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారట. ఇలా అమ్మవారి ఆలయంలో పారాయణం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని మరొకరు ప్రచారం చేశారట. ఈ మాట విని 500 మంది భక్తులు గుడికి వచ్చి, సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడ్డారట.
విజయవాడ దుర్గగుడిలో అర్చకులు, సిబ్బంది నిత్యం పూజలు, ఆర్జిత సేవల నిర్వహణలో బిజీగా ఉంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం ఆలయంపై ఒత్తిడి పెంచుతోందనే చర్చ జరుగుతోందట. కొందరు దుర్గమ్మ ఆలయంలో పూజల చేయాలని, ప్రసాదాలు పంచాలని, పారాయణాల గురించి ప్రచారం చేస్తున్నారట. ఈ ప్రచారాన్ని నమ్మిన భక్తులు, తాము కోరుకున్న పూజలు చేయించుకోవడానికి ఆలయానికి వస్తున్నారట. కానీ ఆలయంలో అలాంటి పూజలు లేవని అధికారులు చెబుతున్నారట. కొందరు అక్కడ గొడవలకు దిగుతున్నారట.. అలా వచ్చిన భక్తులకు నచ్చజెప్పి అమ్మవారి దర్శనం చేయించి పంపిస్తున్నారట. ఈ క్రమంలో ఆలయ సిబ్బందికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయట. భక్తుల నమ్మకాలను వమ్ము చేయకుండా, ఆలయ పవిత్రతను కాపాడుతూనే, ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
విజయవాడ దుర్గమ్మ ఆలయానికికొంతమంది భక్తులు బయటి నుంచి తెచ్చిన ప్రసాదాలు పంచేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆ భక్తుల్ని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయట. ఇటీవల కొందరు వ్యక్తులు.. ఎవరో ఒక స్వామి ఐదు రకాల ప్రసాదాలు, స్త్రీలకు రవికెలు, గాజులు పంచితే సంపద పెరుగుతుందని చెప్పారట. ఈ క్రమంలో చాలామంది భక్తలు పెద్ద సంఖ్యలో ఆటోల్లో ఆలయానికి వచ్చారట. ఈ సంఘటనతో ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో, ఎవరో తెచ్చిన ప్రసాదాలను ఆలయంలో పంచడం వల్ల భక్తుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, భక్తులను తప్పుదోవ పట్టించే వారిని ఎలా కట్టడి చేయాలోనని ఆలోచన చేస్తున్నారట. సోషల్ మీడియా వేదికగా దుర్గమ్మ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారట. భక్తులు కూడా ఇలాంటి మాటలు నమ్మొద్దని.. ఆలయ అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు.
Latest News