|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:19 PM
ఓ 32 ఏళ్ల యువకుడికి 20 సంవత్సరాలుగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నాడు. దీని కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగినా.. ఎలాంటి ఫలితం లేకపోయింది. నొప్పి భరించలేని స్థితికి చేరుకున్న అతడు చివరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లడంతో అక్కడ వైద్యులు అతడ్ని పరీక్షించగా.. భారీ పరిమాణంలో రాయి ఉన్నట్టు గుర్తించారు. శస్త్ర చికిత్స నిర్వహించి దానిని బయటకు తీయగా.. దాని బరువు 500 గ్రాములు ఉండటంతో షాకయ్యారు. విస్తుగొలిపే ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువకుడికి కిడ్నీ స్టోన్ సమస్య ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ సమస్య అతడ్ని వేధిస్తోంది. స్థానికంగా ఉండే చిన్న చిన్నటి ఆస్పత్రులకు వెళ్లినా ఉపశమనం లభించలేదు. ఈ క్రమంలోనే రోజు రోజుకూ నొప్పి తీవ్రం కావడంతో.. ఇటీవల పన్నా జిల్లా ఆస్పత్రికి వెళ్లాడు. ఏరియా ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించగా... భారీ పరిమాణంలో ఓ రాయి ఉన్నట్టు వెల్లడయ్యింది. దీంతో ఆ యువకుడికి సీనియర్ సర్జన్ డాక్టర్ హెచ్‌ఎన్ శర్మ నేతృత్వంలోని వైద్యుల బృందం సర్జరీ చేసి.. ఆ కిడ్నీ రాయిని బయటకు తీశారు. దాని బరువు అర కిలో ఉందని వైద్యులు తెలిపారు. శస్త్రచికత్స అనంతరం బాధితుడు క్రమంగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు.
డాక్టర్ శర్మ మాట్లాడుతూ.. ‘బాధితుడు గత 18-20 ఏళ్లుగా కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతున్నాడు.. మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు కడుపులో మంటను అనుభవించాడు.. మా ఆసుపత్రికి రాగా.. సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పాం’ అని అన్నారు. జనవరి 22న అతడికి సర్జరీ చేసి.. పొట్టలో నుంచి 500 గ్రాములు రాయిని తొలగించామని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు.
‘‘గతంలో బుధ్ సింగ్ అనే వ్యక్తి కిడ్నీలో స్టోన్స్ కోసం నకిలీ వైద్యుల వద్ద చికిత్స తీసుకున్నాడు. నొప్పి భరించలేనంతగా మారడంతో డాక్టర్ హెచ్.ఎన్. శర్మను సంప్రదించాడు... ఆయనను పరీక్షించి, అతని కడుపులో పెద్ద కిడ్నీ రాయి ఉందని, దానికి శస్త్రచికిత్స అవసరమని చెప్పారు’’ అని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
Latest News