చైనా అణురహస్యాలు అమెరికాకు లీక్.. టాప్ జనరల్‌పై విచారణకు ఆదేశం
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 08:22 PM

చైనా రాజకీయ, సైనిక వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా, సైన్యంలో అత్యున్నత హోదాలో ఉన్న జనరల్ జాంగ్ యూక్సియా (75)పై చైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనపై అవినీతి ఆరోపణలే కాకుండా అత్యంత సున్నితమైన అణ్వాయుధ రహస్యాలను అమెరికాకు చేరవేరారన్న సంచలన ఆరోపణలు రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది.


దేశద్రోహం ఆరోపణలు.. షాకింగ్ వివరాలు!


వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హోదాలో ఉన్న జాంగ్ యూక్సియాపై అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన 'కోర్ టెక్నికల్ డేటా'ను అమెరికాకు లీక్ చేశారన్న ప్రధాన ఆరోపణ ఉంది. దీంతో పాటు సైనిక పదవుల కేటాయింపులో భారీగా లంచాలు తీసుకోవడం, సొంత వర్గాలను ఏర్పాటు చేయడం, సైనిక కొనుగోళ్లలో అవినీతికి పాల్పడటం వంటి తీవ్రమైన ఉల్లంఘనలపై ప్రభుత్వం అంతర్గత విచారణ జరుపుతోంది.


తిరుగుబాటు యత్నం నిజమేనా?


ఈ పరిణామాల నేపథ్యంలో చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అధ్యక్షుడి భద్రతా దళాలకు, సైన్యానికి మధ్య ఘర్షణలు జరిగాయని.. వేలాది మంది సైనికులను అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వెలువడినా చైనా ప్రభుత్వం కానీ, పాశ్చాత్య నిఘా సంస్థలు కానీ వీటిని ధృవీకరించలేదు. అయితే షీ జిన్‌పింగ్ చేపట్టిన సైనిక ప్రక్షాళనలో భాగంగానే 2023 నుంచి ఇప్పటి వరకు 50 మందికి పైగా ఉన్నతాధికారులు పదవులు కోల్పోవడం గమనార్హం.


భారత్‌పై ప్రభావం ఏమిటి?


చైనా సైనిక నాయకత్వంలో వస్తున్న ఈ మార్పులు భారత్‌కు అత్యంత కీలకంగా మారుతున్నాయి. వాస్తవాధీన రేఖ (LAC) వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అంతర్గత అస్థిరత భారత్ భద్రతపై ప్రభావం చూపుతుంది. చైనా సైనిక నిర్ణయాధికారాల్లో వచ్చే మార్పులు సరిహద్దు వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై భారత నిఘా వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఒకప్పుడు జిన్‌పింగ్‌కు కుడిభుజంగా ఉన్న జాంగ్ పతనం.. చైనాలో నియంతృత్వ పట్టు ఎంత బలంగా ఉందో చాటిచెబుతోంది.


Latest News
PM Modi to inaugurate AI Impact Expo 2026 on Monday Sun, Feb 15, 2026, 03:58 PM
India-Pak T20 clash: BJP expresses confidence in victory, Cong slams match with terror state Sun, Feb 15, 2026, 03:57 PM
T20 WC: Holder, Hope help Windies beat Nepal by 9 wickets, seal Super 8 spot Sun, Feb 15, 2026, 03:35 PM
India-Pak T20 WC clash: From Bihar to Gujarat, excited fans cheer for Team India Sun, Feb 15, 2026, 03:34 PM
T20 WC: Netravalkar returns as USA opt to bat against Namibia Sun, Feb 15, 2026, 03:00 PM