|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 11:07 AM
ప్రజలకిచ్చిన హామీల అమల్లో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం... గణతంత్రదినోత్సవం సాక్షిగా గవర్నర్ తో పచ్చి అబద్దాలు మాట్లాడించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక అని ఆక్షేపించారు. ఎన్నికల మందు సూపర్ సిక్స్ పేరుతో భారీ హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న చంద్రబాబు... 2 ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడే లేకపోగా.. నిరుద్యోగ భృతి ఊసేలేదని తేల్చి చెప్పారు. ఒకవైపు నిరుద్యోగులను దారుణంగా మోసగించిన కూటమి ప్రభుత్వం.. మరోవైపు రాజధాని కోసం నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకూ మొండిచేయి చూపించడంపై మండిపడ్డారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ సహా అన్ని పథకాల్లోనూ కోత పెట్టిన చంద్రబాబు.. పీ 4 పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని తేల్చి చెప్పారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనం వృధా చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. రూ. 3 లక్షల కోట్లు అప్పు చేసినా... హామీల అమల్లో విఫలమై ప్రజలకు మొండిచేయి చూపించిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
Latest News