మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన మరణాలు
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 08:21 PM

మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అజిత్ పవార్ మరణం ఒక తీరని లోటుగా మిగిలిపోయింది. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూయడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గడిచిన రెండు దశాబ్దాల్లో రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చేసి.. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహామహుల అకాల మరణాల పరంపరలో అజిత్ పవార్ మృతి తాజా విషాదం. ప్రమోద్ మహాజన్ నుంచి మొదలుకుని.. అజిత్ పవార్ వరకు.. మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ప్రముఖ నాయకులు పలువురు ఉన్నారు.


ప్రమోద్ మహాజన్


బీజేపీ అగ్రనేత ప్రమోద్ మహాజన్.. తన రాజకీయ జీవితంలో టాప్‌లో ఉండగా.. అనూహ్యంగా చనిపోయారు. 2006 మే 3వ తేదీన సొంత సోదరుడి కాల్పుల్లో ఆయన మరణించడం దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనను బీజేపీలో కింగ్‌మేకర్‌గా భావించేవారు. టెక్నాలజీని రాజకీయాల్లోకి తీసుకురావడంలో ప్రమోద్ మహాజన్‌ది అందెవేసిన చేయి. ఆయన బతికి ఉంటే దేశ రాజకీయ ముఖచిత్రం మరోలా ఉండేదని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఆయన మరణం బీజేపీలో ఒక పెద్ద వ్యూహకర్త లోటును మిగిల్చింది.


విలాస్‌రావ్ దేశ్‌ముఖ్


మహారాష్ట్రకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్.. 2012 ఆగస్టు 14వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. గ్రామీణ రాజకీయాలపై పట్టు, పరిపాలనా దక్షత కలిగిన నాయకుడిగా విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు పేరుంది. క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న నాయకుడిని కోల్పోవడంతో.. ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ.. మహారాష్ట్రలో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉంది.


గోపీనాథ్ ముండే


బీజేపీలో మాస్ లీడర్‌గా పేరుగాంచిన గోపీనాథ్ ముండే 2014 జూన్ 3వ తేదీన ఢిల్లీలో జరిగిన ఒక కారు ప్రమాదంలో మరణించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగింది. వెనుకబడిన తరగతుల (ఓబీసీ) నేతగా ఆయనకు ఉన్న క్రేజ్ సాటిలేనిది. ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే ద్వయం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం మహారాష్ట్రలో ఒక బలమైన సామాజిక నాయకత్వ శూన్యాన్ని సృష్టించింది.


అజిత్ పవార్


తాజాగా జనవరి 28వ తేదీన బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూసిన అజిత్ పవార్.. మహారాష్ట్రలోనే అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించారు. అజిత్ దాదాగా పిలవబడే ఆయన.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను కాదని పార్టీలో చీలిక తెచ్చిన తర్వాత కూడా తన పట్టును నిరూపించుకున్నారు. బడ్జెట్ రూపకల్పనలో.. సహకార రంగంలో ఆయన వేసిన ముద్ర విస్మరించలేనిది. ఈ తాజా విషాదంతో ఎన్‌సీపీ భవిష్యత్తు, రాష్ట్రంలోని అధికార మహాయుతి కూటమి బలాబలాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Latest News
NSA Doval discusses bilateral, regional cooperation with Saudi counterpart Wed, Feb 04, 2026, 03:55 PM
Sam Curran pretty happy with 'flexible' role in the team Wed, Feb 04, 2026, 03:53 PM
HM Shah to begin three-day J&K visit from tomorrow; MLAs voice optimism and concerns Wed, Feb 04, 2026, 03:35 PM
US rallies highlight violence against Hindus in Bangladesh Wed, Feb 04, 2026, 03:20 PM
BJP files petition in Calcutta HC on 'fabricated' cases against workers, supporters in Sandeshkhali Wed, Feb 04, 2026, 03:18 PM