|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 08:38 PM
దాదాపు 11 వేల అడుగుల ఎత్తులో భారీ మంచు కారణంగా చిక్కుకుపోయిన జవాన్ల కోసం సాధారణ పౌరులు ప్రాణాలకు తెగించి పెద్ద సాహాసం చేశారు. ఐదారు అడుగుల ఎత్తున పేరుకుపోయిన మంచులో 15 కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి సైనికుల వద్దకు చేరుకుని, సహకారం అందించారు. ఐదు గంటలకుపై ట్రెక్కింగ్ చేసి 20 మంది సైనికులను రక్షించారు. రిపబ్లిక్ డే ముందు రోజు జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. సోషల్ మీడియాలో గ్రామస్థులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశం కోసం పనిచేసే సైనికులకు సహాయం చేసి పౌరులు తమ దేశభక్తిని చాటుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఉధంపూర్ జిల్లాలో మంచు తుఫానులో చిక్కుకున్న 12 మంది స్థానికులను పోలీసులు రక్షించిన సంగతి తెలిసిందే.
జనవరి 23న కురిసిన భారీ హిమపాతం కారణంగా 20 మంది సైనికలు చిక్కుకుపోయారని, ఆ సమయంలో వారు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు పక్షం రోజులుగా దట్టమైన అడవుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ త్రాషి-1లో భాగంగా కిష్టావర్ జిల్లాలోని ఛత్రు ప్రాంతానికి సరిహద్దులోని పర్వత శ్రేణి గుండ్నా బ్లాక్‌లోని మోర్చా టాప్‌లో సైనికులను మోహరించారు.
జనవరి 18న ఛత్రువిల్ సింగ్‌పోట ప్రాంతంలోని సింఘ్‌పొర వద్ద ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హవిల్దార్ గజేంద్ర సింగ్ అమరుడు కాగా.. మరో ఏడుగురు సైనికులను గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం వెళ్లిన సైనికులు.. భారీ హిమపాతం కారణంగా దోడా, కిష్ఠావర్ జిల్లాల సరిహద్దులో ఉన్న మోర్చా టాప్‌లో జనవరి 23న చిక్కుకున్నారు.
సైనికులు తమ బేస్ క్యాంప్‌కు సందేశం పంపిన తర్వాత జనవరి 24న సాయంత్రం గుండ్నాలోని ఆర్మీ పోస్ట్ అధికారులు.. సహాయం కోసం గ్రామస్థులను సంప్రదించారు. ‘మేము జనవరి 25 ఉదయం 8.30 గంటలకు సహాయక చర్యలు ప్రారంభించాం... సైన్యం మాకు బూట్లు, గ్లౌజులు, ఆహార పొట్లాలు ఇచ్చింది. మేము ఉన్ని దుస్తులు వేసుకుని మంచులోంచి మోర్చా టాప్ వైపుగా మా ప్రయాణాన్ని ప్రారంభించాం.. మేము మధ్యాహ్నం 1.30 గంటలకు సైనికుల వద్దకు చేరుకుని, సాయంత్రానికి వారిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చాం’ అని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న గ్రామస్తులలో ఒకరు చెప్పారు.
దీనిపై రక్షణ శాఖను సంప్రదించగా.. అధికారి ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బరత్వాల్ మాట్లాడుతూ.. పర్వత ప్రాంతంలో మంచులోంచి దారి చేయడానికి పౌరులు సహకారం అందించారని తెలిపారు. అదే రోజు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) దోడా జిల్లాలోని భదేర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారిపై 11,500 అడుగుల ఎత్తులో ఉన్న చటర్గాలా టాప్ వద్ద ఇంకో రెస్క్యూ చేపట్టింది. జనవరి 26 తెల్లవారుజామున ముగిసిన ఈ ఆపరేషన్‌లో, BRO 40 మంది సైనికులు, సుమారు 20 మంది పౌరులను రక్షించింది.
దోడా, కిష్టావర్ జిల్లాల్లో భారీ హిమపాతంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. కిష్టార్‌లోని మారుమూల వార్వాన్ లోయలో కూడా హిమపాతం సంభవించి పచ్చిక బయళ్లు మంచులో కొట్టుకుపోయాయని, పశువులపై ఆధారపడి జీవిస్తున్న స్థానికులకు ఇది ఒక ముఖ్యమైన ఆందోళన అని వర్గాలు తెలిపాయి.
Latest News