|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 08:45 PM
మరికొన్ని రోజుల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ రాష్ట్రంలోని అధికార విపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులు, సీట్ల పంపకాలు, అధికారం గురించి ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే తమిళనాడులో ఎప్పటినుంచో కలిసి పోటీ చేస్తున్న ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు, అధికారంలో భాగస్వామ్యంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే.. కాంగ్రెస్ పార్టీకి తమిళనాడు మంత్రివర్గంలో చోటు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ - కనిమొళి భేటీ
బుధవారం ఢిల్లీలోని 10 జనపథ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, డీఎంకే ఎంపీ కనిమొళి సమావేశం అయ్యారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు, కూటమి ధర్మంపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే గత కొద్దిరోజులుగా తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి విడిపోతుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన దళపతి విజయ్ కాంగ్రెస్ పార్టీతో జట్టు కడతారనే వార్తలు వినిపించాయి. అయితే తాజా భేటీతో ఆ ప్రచారానికి తెరదించుతూ.. డీఎంకే-కాంగ్రెస్ బంధం తమిళనాడులో కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారు.
మంత్రి పదవులపై నో
అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్‌కు క్యాబినెట్ బెర్తులు (మంత్రి పదవులు) కేటాయించాలని కోరగా.. డీఎంకే వర్గాలు దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో పోటీ చేసి అందులో 18 సీట్లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలు కావాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతుండగా.. డీఎంకే మాత్రం గతంలో ఇచ్చిన సీట్ల కంటే ఒక్కటి కూడా పెంచే ఉద్దేశంలో లేదని తెలుస్తోంది.
విజయ్ పార్టీ ప్రస్తావన
కాంగ్రెస్‌లో ఒక వర్గం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో పొత్తు పెట్టుకుందామని సూచించినప్పటికీ.. హస్తం పార్టీ హైకమాండ్ మాత్రం డీఎంకేతోనే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాజకీయాలు.. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే హాట్ హాట్‌గా మారిపోతున్నాయి.