|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 09:22 PM
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులకు టీటీడీ కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయడం, ఫోటోషూట్స్, రీల్స్ చేయడంపై నిషేధం విధించింది. కానీ కొందరు భక్తులు మాత్రం టీటీడీ నిబంధనల్ని ఉల్లంఘించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొత్తగా పెళ్లైన జంట తిరుమల శ్రీవారి ఆలయం ముందు నుదిటిపై ముద్దులు పెట్టుకుంటూ ఫోటోషూట్ చేయడం వివాదంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో ఉన్న జంట గొల్లమండపానికి అతి సమీపంలో ఫొటో షూట్‌లో చేశారు.
ఈ ఘటనతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీటీడీ భద్రతా సిబ్బంది స్పందించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఇలా ఆలయం ముందు ఫోటోషూట్ చేసిన వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఫోటోషూట్లు, రీల్స్ చేయడంపై టీటీడీ నిషేధం విధించినట్లు టీటీడీ మైకులో కూడా ప్రచారం చేస్తోంది.. కానీ కొందరు భక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈ ఫోటోషూట్ ఎపిసోడ్‌పై టీటీడీ స్పందించాల్సి ఉంది.
గతంలో కూడా కొందరు ఇలాగే ఫోటోషూట్లు చేశారు.. టీటీడీ స్పంందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసుల కూడా నమోదు చేశారు. అంతేకాదు తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై కూడా టీటీడీ నిషేధం విధించింది.. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. టీటీడీ నిబంధనల్ని అమలు చేస్తున్నా.. కొందరపై కేసులు కూడా నమోదు చేసినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
Latest News