|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 03:59 PM
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు సంతృప్తి పొందే వరకు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు. ఇంకా గట్టిగా తయారవుతామని, బెదిరే ప్రసక్తే లేదన్నారు. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో గురువారం ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..... ‘నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నా ఎదుగుదల తట్టుకోలేక ఆయన నన్ను జైళ్లకు పంపుతూ ఉంటారు. 2014లో నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. తను ముఖ్యమంత్రి అయ్యారు. అంతే నన్ను టార్గెట్ చేశారు. 2014–19 మధ్య నాపై 72 కేసులు పెట్టారు. మా చిత్తూరు జిల్లాలోని డిస్ట్రిక్ట్ జైలు మొదలు అన్ని సబ్ జైళ్లలో నెలలపాటు పెట్టించాడు. పక్కనే ఉన్న నెల్లూరు సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైల్లో కూడా పెట్టించారు. అంతటితో వదిలారా అంటే అదీ లేదు. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అదే జైళ్లలో నన్ను కొట్టించారు. చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు నా కళ్లకు గంతలు కట్టి నన్ను పోలీసు బస్సులో కింద కూర్చోబెట్టి చాలా అవమానకరంగా తమిళనాడులోని తిరువళ్లూరు వరకు తీసుకెళ్లారు.అక్కడ బాగా కొట్టారు. అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయానికి నన్ను నెల్లూరు జిల్లా సమీపంలోని సత్యవేడు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ రోజు నేను సత్యవేడు పోలీసు స్టేషన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే అదే రోజు సాయంత్రం నన్ను కోర్టుకు తీసుకెళుతున్నామని చెప్పి పోలీసు జీపులో ఎక్కించుకుని కేవీబీ పురం మండలంలోని ఒక మారుమూల పల్లె దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నన్ను కోర్టు ముందు హాజరు పరిస్తే పోలీసులు కొట్టిన దెబ్బలు చూపిస్తానని కోర్టుకు తీసుకెళ్లకుండా మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు. కేసులు, అరెస్ట్‌లు ప్రారంభించారు. ఈ సారి ఏకంగా 8నెలలు అంటే 230 రోజుల పాటు జైల్లో పెట్టారు అని ఆవేదన చెందారు.
Latest News