|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:06 PM
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఫిబ్రవరి 5వ తేదీన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ధర్నా, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్.వి. మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంయుక్తంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని అన్నారు. సీమ ప్రజల సాగు, త్రాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వెనుక నుండి నీటిని తరలించే ఏర్పాట్లు చేశారని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమకు నీరు అందుతుండగా, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాంతానికి ప్రాజెక్టులు నిర్మించుకుంటోందని చెప్పారు. సీమకు తరలిస్తున్న నీటిని అడ్డుకునేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందంపై ఏపీ మంత్రులు ఒక్కరూ ప్రశ్నించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. గ్రేటర్ రాయలసీమ కోసం ఎత్తిపోతల పథకం సాధించేవరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని నిలిపివేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు.
Latest News