|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 08:56 PM
రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీని మాస్కోకు రష్యా ఆహ్వానించింది. నాలుగేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో శాంతికి ప్రయత్నాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు దేశాలు పరస్పరం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపడానికి అంగీకరించాయనే ప్రచారంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన కొన్ని గంటల తర్వాత క్రెమ్లిన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
అమెరికా మధ్యవర్తిత్వంతో గత వారాంతం అబుదాబిలో జరిగిన చర్చలు శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేశాయి. కానీ, రష్యా, ఉక్రేయిన్ చర్చల వైఖరి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. భీకర పోరాటం ఇప్పటికీ కొనసాగుతుండగా.. ఇటీవలి రష్యా క్షిపణి దాడుల వల్ల ధ్వంసమైన విద్యుత్తు వ్యవస్థ అంతరాయాలతో కీవ్ పోరాడుతోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ , వ్లాదిమిర్ పుతిన్‌లు సమావేశానికి సిద్ధంగా ఉన్నారని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ అమెరికా అధికారి తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ శాంతి ప్రతినిధుల మధ్య అబుదాబిలో ఆదివారం మరోసారి దఫా చర్చలు జరగనున్నాయి. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. కానీ, ఏ ఒప్పందంలోనైనా ఏ భూభాగం ఎవరికి దక్కుతుంది. యుద్ధానంతర ఉక్రెయిన్‌లో అంతర్జాతీయ శాంతి పరిరక్షణ లేదా పర్యవేక్షణ, రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు వంటి అంశాలపై విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ గురువారం మాట్లాడుతూ.. మాస్కోకు రావాలన్న తమ ఆహ్వానానికి జెలెన్2స్కీ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు. అయితే, గతేడాది కూడా మాస్కోకు రష్యా ఆహ్వనించినా.. జెలెన్‌స్కీ తిరస్కరించారు. తమపై రోజూ క్షిపణులతో దాడిచేసే దేశానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు. అంతేకాదు, రష్యా అధ్యక్షుడే తమ దేశానికి రావాలని ఆఫర్ ఇచ్చాడు. పుతిన్, జెలెన్‌స్కీ మధ్య జరిగే ఏ సమావేశమైనా ఫలితాలను వచ్చేది విధంగా ఉండాలని క్రెమ్లిన్ విదేశాంగ విధాన సలహాదారు యూరి ఉషాకోవ్ బుధవారం అన్నారు. ఆయన మాస్కోకు వస్తే భద్రతకు తాము హామీ ఇస్తామని ఆయన చెప్పారు.
అయితే, ఎవరికి ఏ భూభాగం లభిస్తుందనే దానిపై ఇరుపక్షాల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను పరిష్కరించడం చాలా కష్టమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించడం గమనార్హం. డొనెట్‌స్క్ ప్రాంతంలోని 20 శాతం భూభాగం నుంచి ఉక్రెయిన్ దళాలు వెనక్కితగ్గాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అయితే, తాము మాస్కో బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా లేమని కీవ్ తేల్చిచెప్పింది.
Latest News