|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:50 PM
ఈ మధ్య కాలంలో ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఏజెన్సీలో పెద్దపులి దాడులతో జనం బెంబేలెత్తారు. సుమారు వారంపాటు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన పులి.. దాదాపు 12 మూగజీవాలను బలితీసుకుంది. ఆ తర్వాత బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం మీదుగా వచ్చిదారినే పులి అడవుల్లోకి వెనుదిరిగి వెళ్లిందని ప్రచారం జరగడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా పోలవరం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున మండలంలోని ఇటుకలకోట గ్రామంలో మడకం కన్నమ్మ ఇంటికి సమీపంలో కట్టి ఉంచిన రెండు గేదెదూడలపై దాడి చేసి చంపేసింది. అటవీశాఖ అధికారులు, ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. పెద్దపులి బంగారమ్మపేట పొలాల మీదుగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద గోదావరి దాటి సీతానగరం మండలం కొండేపూడి వైపు వెళ్లినట్లు పాదముద్రల ఆధారాలు లభ్యమైనట్టు అటవీక్షేత్రాధికారి ఎస్‌కే వలీ తెలిపారు. పులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు అమర్చామన్నారు.
Latest News