|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:26 PM
రోడ్డు ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు భారీ ఊరట కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు వాహన ప్రమాదాల్లో బాధితులకు లభించే పరిహారంపై వచ్చే వడ్డీకి పూర్తిస్థాయిలో ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నేడు పార్లమెంటులో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో పాటు, ఇకపై ఈ వడ్డీ చెల్లింపులపై మూలధనం వద్ద పన్ను కోత (TDS) కూడా ఉండదని ఆమె స్పష్టం చేశారు.ప్రస్తుత నిబంధనల ప్రకారం, మోటారు ప్రమాదాల క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చే పరిహారంపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తున్నారు. క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం కారణంగా వడ్డీ మొత్తం గణనీయంగా పెరిగి, బాధితులు పన్ను రూపంలో కొంత మొత్తాన్ని కోల్పోతున్నారు. వైద్యం, పునరావాసం కోసం అందాల్సిన పరిహారం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే ప్రభుత్వం ఈ మానవతా దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకుంది."మోటారు ప్రమాదాల క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ద్వారా ఏదేని సహజ వ్యక్తికి లభించే వడ్డీకి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. దీనిపై ఎలాంటి టీడీఎస్ ఉండదు" అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ కొత్త నిబంధన 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది.
Latest News