ఇకపై సుంకాల్లేకుండా 60 గ్రాముల వరకూ తెచ్చేసుకోవచ్చు
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 08:33 PM

విదేశాల నుంచి భారత దేశానికి తిరిగి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చే వారు లేదా అక్కడ పని చేసుకుంటూ స్వదేశానికి వచ్చే భారతీయులు తమతో పాటు తెచ్చుకునే బంగారు ఆభరణాల విషయంలో నిబంధనలను భారీగా సడలించింది. ఆభరణాల విలువపై ఉన్న పరిమితిని తొలగిస్తూ.. స్త్రీలు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకూ బంగారు ఆభరణాలను ఎలాంటి సుంకాల్లేకుండా తెచ్చుకోవచ్చని చెప్పింది. అయితే ఈ కొత్త బ్యాగేజీ నిబంధనలు ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయి.


విలువతో పనిలేదు.. బరువు ఉంటే చాలు!


గతంలో విదేశాల నుంచి బంగారం తెచ్చేటప్పుడు బరువుతో పాటు దాని మార్కెట్ విలువను కూడా కస్టమ్స్ అధికారులు పరిగణనలోకి తీసుకునేవారు. దాని వల్ల నిర్ణీత బరువు తెచ్చినా విలువ పెరిగిపోవడంతో ప్రయాణికులు సుంకం చెల్లించాల్సి వచ్చేది. ముఖ్యంగా పురుషులు రూ.50 వేలు, స్త్రీలు రూ.లక్ష విలువ చేసే ఆభరణాలను మాత్రమే సుంకాలు లేకుండా తెచ్చుకునేవారు. అంతకుమించి తెచ్చుకుంటే.. డబ్బులు ఎక్కువగా చెల్లించాల్సి వచ్చేది. అయితే తాజా సవరణల ప్రకారం ఆభరణాల విలువ ఎంత ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నిర్దేశించిన బరువు పరిమితి లోపు ఉంటే ఎలాంటి సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల మధ్యతరగతి ప్రయాణికులకు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలుగుతుంది.


కొత్త నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చే మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు. అలాగే పురుషులు 20 గ్రాముల బంగారాన్ని ఎలాంటి సుంకం లేకుండా తెచ్చుకోవచ్చు. అలాగే 15 ఏళ్లలోపు వయసున్న పిల్లలు కూడా 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఎలాంటి టాక్స్ లేకుండా తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఈ రాయితీ కేవలం ఏడాదికి మించి విదేశాల్లో నివసిస్తున్న భారతీయ నివాసితులకు లేదా భారత సంతతికి చెందిన పర్యాటకులకు మాత్రమే వర్తిస్తుంది.


వ్యక్తిగత వినియోగం తప్పనిసరి..


ఈ నిబంధనల వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిబంధనను కూడా పెట్టింది. విదేశాల నుంచి తెచ్చే ఆభరణాలు కేవలం వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే అయి ఉండాలి. వాటిని దేశంలోకి తెచ్చి విక్రయించడానికి లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వాడటానికి వీళ్లేదు. ఒకవేళ వాణిజ్య పరంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకూ ఊరట


కేవలం బంగారం మాత్రమే కాదు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన ప్రయాణికులు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఒక కొత్త ల్యాప్‌టాప్‌ను లేదా నోట్‌ప్యాడ్‌ను ఎలాంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా తీసుకురావచ్చు. డిజిటల్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి నాణ్యమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.


గతంలో బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడు పెట్టిన విలువ పరిమితులు ఇప్పుడు భారంగా మారాయని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించి బరువును ప్రామాణికంగా తీసుకుంది. దీనివల్ల కస్టమ్స్ తనిఖీల వద్ద ప్రయాణికులకు వేధింపులు తగ్గుతాయని, విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఇబ్బందులు తొలగుతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


Latest News
PM Modi, EU member states discuss strengthening cooperation through FTA Wed, Feb 18, 2026, 04:09 PM
T20I rankings: Abhishek maintains top spot; Ishan enters top 10 in batting chart Wed, Feb 18, 2026, 04:07 PM
T20 WC: SA go into Super 8s as unbeaten side with win over UAE Wed, Feb 18, 2026, 03:17 PM
France moving into top tier of India's foreign policy priorities Wed, Feb 18, 2026, 03:04 PM
T20 WC: Afridi out, Salman in as Pakistan opt to bat against Namibia in must win Group A game Wed, Feb 18, 2026, 02:56 PM