బలూచిస్థాన్‌లో మా బలగాలు చేతులేత్తేశాయి.. పాకిస్థాన్
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 08:47 PM

బలూచీస్థాన్‌ వేర్పాటువాదులు చేతుల్లో పాకిస్థాన్ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) రెబల్స్‌కు పాక్ సైన్యం ఎదురు నిలబడి పోరాడలేని పరిస్థితి నెలకుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. బలూచీస్థాన్‌ ప్రావిన్సుల్లో రెబల్స్‌ను ఎదుర్కొనలేక తమ సైన్యం చేతులెత్తేసిందని ఆయన వ్యాఖ్యానించారు. బలూచ్ ప్రావిన్సులోని అనేక పట్టణాలపై ఏకకాలంలో రెబల్స్ దాడులు చేసి కనీసం 80 మంది భద్రతా సిబ్బందిని చంపి, 30కి పైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కొన్ని రోజుల తర్వాత ఆయన నుంచి వ్యాఖ్యలు వచ్చాయి.


పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మంగళవారం జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశంలో వీస్తీర్ణంలో అతిపెద్దది, జనాభాలో చిన్నది అయిన బలూచీస్థాన్‌లో భద్రతా బలగాలు ఎదుర్కొంటున్న భౌగోళికపరమైన సవాళ్లను వివరించారు. కనీసం 12 ప్రదేశాలలో రెబల్స్ సమన్వయంతో దాడులు చేసిన తర్వాత తీవ్రమైన భద్రతా పరిస్థితి నెలకుందని తెలిపారు. అయితే, బలూచ్‌లో తమ సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిరోధక చర్యలలో కనీసం 177 మంది తిరుగుబాటుదారులు హతమైనట్టు అధికారులు ప్రకటన చేశారు. కానీ, బీఎల్ఏ మాత్రం తమ మహిళా ఆత్మాహుతి బాంబర్లు పాకిస్థాన్ సైన్యాలను పెద్ద సంఖ్యలో హతమార్చినట్టు ప్రకటించాయి.


‘‘భౌగోళికంగాపాకిస్థాన్ భూభాగంలో బలూచిస్థాన్ 40 శాతానికి పైగా ఉంది... దీనిని నియంత్రించడం జనసాంద్రత ఉన్న నగరాన్ని నియంత్రించడం కంటే చాలా కష్టం.. భారీ సంఖ్యలో బలగాలను మోహరించాల్సిన అవసరం ఉంది. మన సైనికులను అక్కడ మోహరించి, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాం.., కానీ ఇంత పెద్ద ప్రాంతానికి కాపలా కాయడం, గస్తీ తిరగడం వల్ల వారు శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు’’ అని తెలిపారు. బలూచ్ రెబల్స్ గతవారంతంలో జరిపిన హింసలో కనీసం 33 మంది పౌరులు, 17 మంది సైనికులు చనిపోయినట్టు పాక్ అధికారులు వెల్లడించారు.


బలూచ్ లిబరేషన్ ఆర్మీతో ఎటువంటి చర్చలు ఉండబోవని ఖవాజా అసిఫ్ తేల్చిచెప్పారు. మహిళలు, చిన్నారులు సహా పౌరులను చంపుతోన్న ఉగ్రవాదులతో చర్చలు ప్రసక్తేలేదని పాక్ రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. నేరస్థులకు, వేర్పాటువాద గ్రూపులకు మధ్య సంబంధం ఉందని, బీఎల్ఏ బ్యానర్ కింద నేర ముఠాలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘బలూచ్‌లోని గిరిజన పెద్దలు, అధికార యంత్రాంగం, వేర్పాటువాద ఉద్యమాలను నడుపుతున్న వారు ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.. ఈ స్మగ్లర్లు గతంలో చమురు అక్రమ రవాణా ద్వారా రోజుకు 4 బిలియన్ల పాక్ రూపాయల వరకు సంపాదించారు’ అని పేర్కొన్నారు. అఫ్గనిస్థాన్, ఇరాన్‌తో సరిహద్దులు పంచుకునే బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతోంది. పాక్ పాలన కింద తాము ఉండబోమని, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారు.

Latest News
PM Modi, EU member states discuss strengthening cooperation through FTA Wed, Feb 18, 2026, 04:09 PM
T20I rankings: Abhishek maintains top spot; Ishan enters top 10 in batting chart Wed, Feb 18, 2026, 04:07 PM
T20 WC: SA go into Super 8s as unbeaten side with win over UAE Wed, Feb 18, 2026, 03:17 PM
France moving into top tier of India's foreign policy priorities Wed, Feb 18, 2026, 03:04 PM
T20 WC: Afridi out, Salman in as Pakistan opt to bat against Namibia in must win Group A game Wed, Feb 18, 2026, 02:56 PM