హిందువుల్లో నాలుగు రకాలు ఉన్నారు.. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్
 

by Suryaa Desk | Sun, Feb 08, 2026, 07:55 PM

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భాగవత్.. ముంబైలో నిర్వహించిన '100 సంవత్సరాల సంఘ్ ప్రయాణం' కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండినప్పటికీ.. ఆరెస్సెస్ చీఫ్ పదవి నుంచి ఎందుకు ఆయన ఇంకా దిగిపోలేదు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో హిందువుల గురించి మాట్లాడిన మోహన్ భాగవత్.. మొత్తం నాలుగు రకాల హిందువులు ఉన్నారని పేర్కొన్నారు. ఇక భారతదేశంలో నివసించే ప్రతీ ఒక్క వ్యక్తి హిందువేనని తేల్చి చెప్పారు.


హిందూ అంటే కేవలం నామవాచకం కాదని.. మన దేశ నాగరిక స్వభావాన్ని ప్రతిబింబించే విశేషణమని వెల్లడించారు. భారత్‌లో నివసిస్తున్న ముస్లింలు, క్రిస్టియన్లు అంతా ఈ దేశానికి చెందినవారేనని మోహన్ భాగవత్ వెల్లడించారు. ఇక భారత్‌లో నాలుగు రకాల హిందువులు ఉన్నారని.. మొదటి రకం వారు తాము హిందువులం అని గర్వంగా చెప్పేవారని తెలిపారు. ఇక రెండో రకం వారు హిందువులైతే గర్వపడడానికి ఏం ఉందని ప్రశ్నించేవాళ్లని పేర్కొన్నారు.


అదే మూడో రకం వారు చాలా సున్నితంగా ఉంటారని.. వాళ్లు అడిగితేనే తాము హిందువులం అని చెబుతారని వెల్లడించారు. ఇక నాలుగో రకం వాళ్లు తాము హిందువులం అనేదే మ‌ర్చిపోయిన‌ వాళ్లు అని.. లేదా మ‌ర్చిపోయేలా చేయ‌బ‌డిన వాళ్లని మోహన్ భాగవత్ తెలిపారు. ఇంకా చాలా మంది హిందువులను కూడా.. తాము హిందువులమని మ‌ర్చిపోయేలా చేసేందుకు అనేక ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని సంచలన ఆరోపణలు చేశారు.


ఎవరైనా హిందుత్వాన్ని స్వీక‌రించాలని భావిస్తే.. త‌మ నమ్మకాలు, భాష‌, మ‌త‌ప‌ర‌మైన ఆచారాల‌ను వ‌దిలేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆరెస్సెస్ చీఫ్ స్పష్టం చేశారు. అందరి భ‌ద్రత‌కు హిందుత్వం హామీ ఇస్తుంద‌ని వెల్లడించారు. ఒక వ్యక్తి విశ్వాసాలు, ఆహార‌పు అల‌వాట్లు, భాష వేర్వేరుగా ఉండొచ్చు కానీ.. మ‌న‌ం అందరం ఒకే స‌మాజం, ఒకే దేశం, ఒకే సంస్కృతి అని స్పష్టం చేశారు. దాన్నే హిందుత్వం అని పిలుస్తామ‌ని.. దీన్నే భార‌తీయ‌త అని కూడా పిల‌వ‌చ్చని తేల్చి చెప్పారు.


అదే సమయంలో ఆరెస్సెస్ అధినేతగా తన రిటైర్మెంట్‌పై స్పందించిన మోహన్‌ భాగవత్‌.. వయసు నిండినా పదవిలోనే ఉండాల సంఘ్‌ తనను కోరినట్లు చెప్పారు. ఒకవేళ చీఫ్ పదవి నుంచి దిగిపోవాలని ఆదేశాలు జారీ చేస్తే.. ఎప్పుడైనా తప్పుకునేందుకు రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆరెస్సెస్‌ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ రిటైర్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదని గుర్తు చేశారు.


ఇక ఆరెస్సెస్‌ అధిపతి పదవికి ఎన్నికలుండవని.. రీజినల్‌, డివిజనల్‌ చీఫ్‌లు సర్‌సంఘ్‌చాలక్‌ను నియమిస్తారని వెల్లడించారు. పదవి నుంచి విరమణ ఉంటుంది కానీ.. పని నుంచి మాత్రం ఎప్పటికీ ఉండదని మోహన్ భాగవత్‌ స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరి చివరి రక్తపు బొట్టు వరకు స్వయంసేవకులను సంఘ్‌ పని చేయించుకుంటుందని వ్యాఖ్యలు చేశారు.


దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను వీర్ సావర్కర్‌కు ప్రకటిస్తే దాని ప్రతిష్ఠ ఇంకా పెరుగుతుందని మోహన్ భాగవత్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రయోజనాలకు నష్టం కలగకుండా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని.. ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాల్సిన అవసరం ఉందని.. కానీ అది విభేదాలకు దారితీయొద్దని స్పష్టం చేశారు.

Latest News
US targets Iran's military positions near Chabahar Free Trade Zone Mon, Mar 16, 2026, 04:08 PM
US watchdog slams Pakistan for 'egregious violations' of religious freedom Mon, Mar 16, 2026, 04:07 PM
Slippers row: Karnataka BJP demands arrest of Booker Prize awardee Banu Mushtaq Mon, Mar 16, 2026, 03:13 PM
We will not meddle with temple, school properties: Karnataka Waqf Minister Mon, Mar 16, 2026, 03:09 PM
JMB revives all-women 'Sister Wing', targets women in South India for recruitment Mon, Mar 16, 2026, 02:47 PM