|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 08:55 PM
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువుల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. తాజాగా అవామీ లీగ్ మాజీ నేత, మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ (86) పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 18 నెలలుగా జైలులోనే ఉన్న ఆయన.. అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ అధికారులు కనీస వైద్యం గానీ అందించలేదు. అలాగే కోర్టు కూడా బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై శనివారం రాత్రి కన్నుమూశారు. ఇది కేవలం మరణం కాదని, వ్యవస్థీకృతమైన హత్యని మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
విద్యావేత్త నుంచి మాజీ మంత్రి వరకు..
రమేష్ చంద్ర సేన్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ఒక గొప్ప విద్యావేత్త, పార్లమెంటేరియన్. బంగ్లాదేశ్ విద్యా రంగంలో, రాజకీయాల్లో ఆయన దశాబ్దాల కాలం పాటు విశేష సేవలు అందించారు. అయితే 18 నెలల క్రితం ఒక అల్లరి మూక ఆయనపై దాడి చేయగా.. బాధితుడైన సేన్‌ను రక్షించాల్సింది పోయి పోలీసులు ఆయన్నే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా స్పష్టంగా వెల్లడించకుండా.. ఒక కేసు తర్వాత మరో కేసును ఆయనపై బనాయిస్తూ వచ్చారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెయిల్ నిరాకరణ.. దిగజారిన ఆరోగ్యం
జైలులో ఉన్న కాలంలో సేన్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. తాను చాలా బలహీనంగా మారుతున్నానని, సరైన చికిత్స అవసరమని ఆయన కోర్టులో పలుమార్లు మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ బెయిల్ మంజూరు కాకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక కేసులో విముక్తి లభిస్తుందనుకున్న తరుణంలో.. మరో కల్పిత కేసును ఆయనపై మోపే వారని వారు తెలిపారు. చివరకు శనివారం రాత్రి పరిస్థితి విషమించడంతో కస్టడీలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
బంగ్లాదేశ్‌లో హిందూ నాయకులు కస్టడీలో మరణించడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా నెల రోజుల క్రితం అంటే జనవరి 11వ తేదీన అవామీ లీగ్‌కే చెందిన మరో హిందూ నేత ప్రళయ్ చాకీ కూడా పోలీసుల అదుపులో ఉండగానే మరణించారు. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పట్ల ప్రభుత్వం, భద్రతా దళాల వైఖరిని ఎండగడుతున్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ కస్టడీ మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. దశాబ్దాలుగా దేశానికి సేవ చేసిన ఒక మాజీ మంత్రికే ఈ గతి పడితే.. సామాన్య హిందువుల పరిస్థితి ఏంటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Latest News