|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 09:01 PM
రష్యాలోని బాష్‌కోర్టోస్థాన్ రిపబ్లిక్‌లో శనివారం ఘోరమైన హింసాకాండ చోటుచేసుకుంది. ఉఫా నగరంలోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లోకి ఒక టీనేజర్ చొరబడి విచక్షణారహితంగా జరిపిన కత్తిపోట్ల దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులు సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నియో-నాజీ భావజాలంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనను ధృవీకరిస్తూ.. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది.
హాస్టల్‌లో మారణహోమం.. రక్తసిక్తమైన గోడలు
శనివారం ఉదయం 15 ఏళ్ల వయసున్న ఒక బాలుడు కత్తితో మెడికల్ యూనివర్సిటీ వసతి గృహంలోకి ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలు పెట్టాడు. కంటపడిన వారందరినీ పొడుస్తూ బీభత్సం సృష్టించాడు. ఈ దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులకు కత్తిపోట్లు తగిలాయి. దాడి జరిగిన సమయంలో అక్కడ అంతా రక్తసిక్తం కాగా.. నిందితుడు బాధితుల రక్తంతో గోడలపై 'స్వస్తిక్' చిహ్నాలను గీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంతేకాకుండా యూదుల మారణహోమం గురించి అతడు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసినట్లు వివరించారు.
అయితే దాడి జరుగుతుండగానే కొందరు విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈక్రమంలోనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలోనే పట్టుబడకుండా ఉండేందుకు నిందితుడు పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు పోలీస్ అధికారులను కత్తితో గాయపరిచాడు. అనంతరం తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగోలా అతడిని నిలువరించిన పోలీసులు వెంటనే బాధితులు, గాయపడిన పోలీసులు సహా నిందితుడిని సైతం ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు నిషేధిత 'NS/WP' అనే నియో-నాజీ సంస్థకు చెందినవాడని రష్యాలోని ప్రముఖ టెలిగ్రామ్ ఛానల్ 'బాజా' వెల్లడించింది.
భారత రాయబార కార్యాలయం స్పందన
ఈ విషాదకర ఘటనపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కజాన్‌లోని కాన్సులేట్ నుంచి ఉన్నతాధికారులు ఉఫాకు బయలుదేరి వెళ్లినట్లు వెల్లడించింది. "మేం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. నలుగురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నాం" అని ఎంబసీ ప్రకటించింది. రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది.
Latest News