|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 10:57 PM
తమ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ఆలోచించే వారు తమ పేరుపై జీవిత బీమా పాలసీ కొనుగోలు చేస్తుంటారు. పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుంది. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి మరణానికి జీవిత బీమా కింద కవరేజ్ వర్తించకపోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. అంటే పాలసీదారు మరణించినా, కుటుంబానికి బీమా హామీ ఇవ్వరు. అలాంటి మినహాయింపుల గురించి ప్రతి ఒక్క పాలసీదారు తెలుసుకోవాలి. లేదంటే తమ కుటుంబం నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ఆత్మహత్య
లైఫ్ ఇన్సూరెన్స్ మినహాయింపుల్లో ఆత్మహత్య ఒకటి. బీమా చేసిన వ్యక్తి ఒక నిర్దిష్ట సమయంలో, సాధారణంగా పాలసీ తీసుకున్న 1-2 ఏళ్లలోనే ఆత్మహత్య చేసుకుంటే చాలా జీవిత బీమా పాలసీలు డెత్ క్లెయిమ్ చెల్లించవు. ఈ వ్యవధిలో పాలసీదారుడు ఆత్మహత్య చేసుకుంటే చెల్లించిన బీమా ప్రీమియంలో 80 శాతం వరకు ఇస్తారు కావచ్చు కానీ, డెత్ కవరేజీ మాత్రం ఇవ్వకపోవచ్చు.
వ్యాధులు చెప్పకపోవడం
పాలసీ కొనుగోలు చేసే సమయంలో చెప్పకుండా దాచిపెట్టిన వ్యాధుల కారణంగా పాలసీదారు మరణిస్తే బీమా కంపెనీలు బీమా మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరిస్తాయి. పాలసీ కొనే ముందు పాలసీదారుకు తీవ్రమైన అనారోగ్యం ఉండి, బీమా కంపెనీకి తెలియజేయకపోతే క్లెయిమ్ తిరస్కరించవచ్చు. ఎయిడ్స్, హెచ్ఐవీ లేదా ఇతర లైంగికపరమైన వ్యాధుల వల్ల పాలసీదారు మరణిస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.
ప్రమాదకర పనులు
కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు.. స్కైడైవింగ్, స్కూబా డైవింగ్, పారా గ్లైడింగ్, కార్ రేసింగ్ వంటి వాటిని ప్రమాదకర కార్యకలాపాలుగా పరిగణిస్తాయి. వాటిల్లో మరణిస్తే కవరేజీ ఇవ్వరు. అదనంగా స్టంట్ పర్ఫార్మర్లు లేదా పైలట్లు వంటి ప్రమాదకర వృత్తుల్లోని వ్యక్తులు పని సంబంధిత ప్రమాదాలకు మినహాయింపులు ఎదుర్కోవాలి. ఈ మినహాయింపు విస్తృతంగా మారుతుంటుంది. పాలసీ తీసుకునే ముందే డాక్యుమెంటులో ఉండే మినహాయింపులను జాగ్రత్తగా తెలుసుకోవాలి.
మాదకద్రవ్యాలు, మద్యం
పాలసీలలో మద్యం లేదా మాదక ద్రవ్యాల వల్ల కలిగే మరణాలకు మినహాయింపులు ఉంటాయి. వీటిని అధిక మోతాదులో తీసుకుని మరణిస్తే లేదా వాటి ప్రభావంతో వాహనం నడిపి ప్రమాదవశాత్తు మరణించినా ఇన్సూరెన్స్ పరిహారం ఇవ్వరు. అంటే పాలసీదారు ప్రమాదం జరిగే సమయంలో డ్రగ్స్ లేదా మద్యం ప్రభావంలో ఉంటే క్లెయిమ్ తిరస్కరిస్తారు.
యుద్ధం, ఉగ్రవాదం
యుద్ధం, సైనిక చర్యలు లేదా ఉగ్రవాదం వల్ల కలిగే మరణాలను లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ నుంచి మినహాయించారు. యూద్ధం లేదా సైనిక సంఘర్ణణలో పాలసీదారు మరణిస్తే దానికి సాధారణంగా బీమా కవరేజీ ఉండదు. ఇది చాలా తరచుగా టర్మ్ లైఫ్ పాలసీలలో కనిపిస్తుంది. అయితే, కొన్ని పాలసీలు యుద్ధ సంబంధిత మినహాయింపుల కోసం నిర్దిష్ట యాడ్ ఆన్స్ అందిస్తుంటాయి. రైడర్ల వల్ల పరిహారం లభించవచ్చు.
నేరాలు
లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి నేరు చేస్తున్నప్పుడు లేదా చేసే ప్రయత్నంలో మరణిస్తే బీమా హామీ ఇవ్వరు. ముఖ్యంగా పాలసీదారుడి హత్యలో లబ్ధిదారుని ప్రమేయం ఉందని అనుమానిస్తే క్లెయిమ్ తిరస్కరిస్తాయి.
Latest News