|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 09:03 PM
తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్షించబడతాడు అంటూ పెద్దలు చెప్పిన మాటలు నిజమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే 45 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి ఆరుగురు వ్యక్తులతో కలిసి ఓ దొంగతనం చేశాడు. ముఖ్యంగా రూ.115 విలువ చేసే 100 కిలోల గోధుములన్ని ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తిని.. పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తప్పు చేసిన విషయం కూడా మర్చిపోయిన 80 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకోవడంతో.. ఆయన కుటుంబం మొత్తం ఆశ్యర్యపోయింది. తమ తండ్రి ఏం చేశాడంటూ ఆయన కుమారుడు పోలీసులను అడగ్గా.. వారు చెప్పిన వాస్తవాలు విని షాక్ అయ్యాడు.
అసలేం జరిగిందంటే..?
1980లో మధ్య ప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలోని బల్సముంద్ కాకద్ ప్రాంతంలో సలీమ్ అనే వ్యక్తి మరో ఆరుగురితో కలిసి ఒక రైతు పొలంలో చొరబడ్డాడు. అక్కడ ఉన్న సుమారు 100 కేజీల గోధుమలను దొంగిలించారు. అయితే విషయం గుర్తించిన యజమాని వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన పొలంలోంచి కొందరు 100 కిలోల గోధములు దొంగిలించినట్లు చెప్పి కేసు పెట్టాడు. అయితే అప్పట్లో ఆ 100 కేజీల గోధుమల విలువ రూ.115 రూపాయలు కాగా.. పోలీసులు నిందితుల కోసం గాలించారు. కానీ సలీమ్ మాత్రం పట్టుబడలేదు. ముఖ్యంగా కేసు నమోదు అయినప్పటి నుంచే సలీమ్ పోలీసులకు చిక్కకపోవడంతో.. అతనిపై కోర్టులో విచారణ పెండింగ్‌లో పడింది. ఈక్రమంలోనే నాటి నుంచి వారెంట్లు జారీ అవుతూనే ఉన్నాయి.
కిరాణా కొట్టు నడుపుతూ..
అయితే దశాబ్దాలు గడిచినా పోలీసులు ఆ పాత ఫైళ్లను మాత్రం మూసివేయలేదు. తాజాగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం గాలింపు చేపట్టగా సలీమ్ ఆచూకీ లభించింది. ప్రస్తుతం అతను బలక్‌వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో తన కుమారుడితో కలిసి ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 80 ఏళ్లు కాగా.. పాత నేరాన్ని గుర్తుంచుకున్న పోలీసులు వ్యూహాత్మకంగా వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా షాక్‌కు గురయ్యారు.
జ్యుడీషియల్ కస్టడీకి వృద్ధుడు..
శనివారం పోలీసులు సలీమ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. 45 ఏళ్ల క్రితం నాటి వారెంట్ ఇంకా అమలులో ఉండటంతో.. న్యాయమూర్తి అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. వంద రూపాయల విలువైన వస్తువు కోసం, వృద్ధాప్యంలో జైలు పాలు కావాల్సి రావడం ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
Latest News