|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 09:11 PM
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 1989లో దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి.. అంటే గత 37 ఏళ్లుగా నిరంతరాయంగా పాటిస్తున్న ఒక కీలక సంప్రదాయాన్ని ఆయన మొట్ట మొదటి సారిగా పక్కన పెట్టారు. ఫిబ్రవరి 8వ తేదీన ప్రతి ఏటా నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సమావేశానికి ఖమేనీ గైర్హాజరు అయ్యారు.
అసలేమిటా సంప్రదాయం?
1979 ఫిబ్రవరి 8వ తేదీన ఇరాన్ వాయుసేన అధికారులు పహ్లావీ రాజవంశాన్ని కూల్చి వేసేందుకు అప్పటి విప్లవ నేత రుహోల్లా ఖొమేనీకి విధేయత ప్రకటించారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ కమాండర్లు దేశ అత్యున్నత నేతను కలవడం ఆచారంగా వస్తోంది. చివరికి కరోనా మహమ్మారి సమయంలో కూడా ఖమేనీ ఈ సమావేశానికి హాజరు అయ్యారు. కానీ ఈ ఏడాది ఆయనకు బదులుగా సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీమ్ మూసవి కమాండర్లతో భేటీ అయ్యారు.
ఖమేనీ గైర్హాజరు వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థపై ట్రంప్ గురి పెట్టడం, ఒకవేళ దాడులు జరిగితే అది మొత్తం మధ్యప్రాచ్యానికి వ్యాపిస్తుందని ఇరాన్ హెచ్చరించడం ఉద్రిక్తతలను పెంచాయి. దీనికి తగ్గట్టుగానే అమెరికా తన యుద్ధ విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్'ను అరేబియా సముద్రంలోకి పంపింది. అలాగే జోర్డాన్‌లోని కీలక స్థావరాలకు ఎఫ్-15 యుద్ధ విమానాలు, రీపర్ డ్రోన్లను భారీగా తరలించింది.
ముదురుతున్న దౌత్య వివాదం
2025 జూన్‌లో జరిగిన 12 రోజుల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత పరిస్థితి మరింత విషమించింది. ఇరాన్ కేవలం తన అణు కార్యక్రమంపైనే చర్చిస్తానని చెబుతుండగా.. క్షిపణి వ్యవస్థను కూడా చర్చల్లోకి తేవాలని అమెరికా పట్టుబడుతోంది. ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో ట్రంప్ ఎప్పుడైనా వైమానిక దాడులకు ఆదేశించవచ్చని నిఘా వర్గాల భోగట్టా. అందుకే ఖమేనీ బహిరంగంగా కనిపించకుండా తన భద్రతను కట్టుదిట్టం చేసుకుంటున్నట్లు సమాచారం.
Latest News