|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 09:15 PM
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా అతిపెద్ద కుంభకోణం అయిన సెక్స్ కుంభకోణం ప్రధాని నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణం రహస్యం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. 2019లో ఆయన జైలు గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. తాజాగా అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన పత్రాలు అనేక రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎప్‌స్టీన్ మరణించాడని ప్రకటించే అధికారిక ప్రకటనను, ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందే అధికారులు సిద్ధం చేసినట్లు ఈ ఫైళ్లు వెల్లడిస్తున్నాయి.
ఒక రోజు ముందే ప్రకటన ఎలా సాధ్యం?
తాజాగా వెలుగులోకి వచ్చిన 23 పత్రాల్లో.. న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం రూపొందించిన ఒక డ్రాఫ్ట్ స్టేట్‌మెంట్ కలకలం రేపుతోంది. దీనిపై 2019 ఆగస్టు 9వ తేదీ అని ఉండగా.. ఎప్‌స్టీన్ మరుసటి రోజు అంటే ఆగస్టు 10వ తేదీన ఉదయం తన జైలు గదిలో విగతజీవిగా కనిపించాడు. అప్పటి అటార్నీ జెఫ్రీ ఎస్. బెర్మన్ పేరుతో ఉన్న ఈ ప్రకటనలో.. "ఈ ఉదయం ఎప్‌స్టీన్ మరణించినట్లు మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ ధృవీకరించింది" అని ఉంది. ఒక వ్యక్తి మరణించడానికి 24 గంటల ముందే ఆయన చనిపోయినట్లు ప్రకటన సిద్ధం కావడం వెనుక ఏదైనా ముందస్తు ప్లాన్ ఉందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఎప్‌స్టీన్ మరణానికి కొన్ని గంటల ముందు జైలులోని నిఘా కెమెరాల ఫుటేజీని విశ్లేషించిన ఇన్వెస్టిగేటర్లకు ఒక వింత దృశ్యం కనిపించింది. ఆగస్టు 9వ తేదీ రోజు రాత్రి 10.39 గంటల సమయంలో.. ఎప్‌స్టీన్ సెల్ ఉన్న ప్రాంతం వైపు ఒక 'ఆరెంజ్ కలర్' డ్రెస్ వేసుకున్న వ్యక్తి వెళ్తున్నట్లు గుర్తించారు. న్యాయశాఖ దీనిని ఒక అధికారి అని చెబుతున్నప్పటికీ.. స్వతంత్ర విశ్లేషకులు మాత్రం అది జైలు దుస్తుల్లో ఉన్న మరో ఖైదీ అని అభిప్రాయ పడుతున్నారు. ఆ సమయంలో ఖైదీలను తరలించడం జైలు నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ అంశం మరింత అనుమానాస్పదంగా మారింది.
ఎప్‌స్టీన్ తన జైలు గదిలో బెడ్ షీట్ లేదా షర్టుతో ఉరివేసుకుని చనిపోయాడని అధికారులు ప్రకటించారు. అయితే 89 పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో ఆయన గొంతు వద్ద ఎముకలు విరిగి ఉన్నట్లు నివేదించింది. సాధారణంగా ఇలాంటి గాయాలు ఉరి వేసుకున్న వారి కంటే, గొంతు పిసికి చంపిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తాజాగా విడుదలైన ఫోటోల్లో ఎప్‌స్టీన్‌ను ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు మెడికల్ రిపోర్టుల్లో ఆయన పేరును 'Jeffrey'కి బదులుగా 'Jeffery' అని తప్పుగా రాసినట్లు కూడా గుర్తించారు. ఈ ఆధారాలు అన్నీ ఎప్‌స్టీన్ మరణం కేవలం ఆత్మహత్య కాదని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందనే వాదనలకు బలాన్ని ఇస్తున్నాయి.
Latest News