|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:39 PM
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు, సీబీఐ సిట్ నివేదిక సాక్షిగా పచ్చి అబద్ధాలని తేలినా ఇంకా దుష్ప్రచారం చేయడంపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం స్వామివారిని బజారుకు ఈడ్చడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. కడపలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గాలివార్తల ఆధారంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై విషప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. కేవలం వైయస్.జగన్ పై వ్యతిరేకత పెంచాలనే దురుద్దేశంతో ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారంటూ పచ్చి అబద్దాలు ప్రచరం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంతటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం దేశ చరిత్రలోనే అత్యంత దారుణమని విమర్శించారు. సీబీఐ,ఎన్డీడీబీ వంటి అత్యున్నత సంస్థలు జంతుకొవ్వు లేదని చెబుతున్నా, చంద్రబాబు ఇంకా కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ఇప్పుడు నెయ్యిలో యాసిడ్స్ కలిపారంటూ మళ్లీ విషప్రచారం మొదలుపెట్టారని, ఇది కేవలం గతంలో చేసిన అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికేనని తేల్చి చెప్పారు. స్వామివారి పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు దేవుడి శిక్ష తప్పదని, అబద్ధాలు ఆడిన వారి నోరు పడిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఇప్పటికైనా చంద్రబాబు స్వామివారికి, కోట్లాది మంది భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.
Latest News