|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 09:41 PM
బాబ్రీ మసీదు పునర్ నిర్మాణం సాధ్యం కాదని, ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉద్ఘాటించారు. కాగా, శతాబ్దాలుగా సాగుతోన్న రామజస్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. వివాదాస్పద భూమి రామజన్మభూమి ఆలయ నిర్మాణానికి అప్పగించి, దానికి ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణం కోసం ముస్లిం వర్గానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్య సమీపంలోని ధన్నిపూర్‌లో ఐదు ఎకరాలను యూపీ ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో మసీదు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆసుపత్రి, లైబ్రరీ, మ్యూజియంతో కూడిన కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఈ తరుణంలో యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తీర్పు వెలువడిన రోజు కోసం ఎదురుచూసేవారి కలలు ఎప్పటికీ నెరవేరవని, అలాంటి రోజు ఎప్పటికీ రాదని యోగి స్పష్టం చేశారు. మంగళవారం బారాబంకిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. తన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. దాని పని పరిధిని మాత్రమే తమ ప్రభుత్వం మాట్లాడుతుందని అన్నారు. అయోధ్యపై బీజేపీ వైఖరిని గుర్తుచేసుకుంటూ.. ‘‘మేము రాముడి కోసం వస్తాం.. అదే స్థలంలో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పాం.. ఇందులో ఏదైనా సందేహం ఉందా?’’ అని పేర్కొన్నారు.
భారత వారసత్వం, అద్భుతమైన సంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల గౌరవాన్ని నొక్కిచెప్పిన యోగి.. కాషాయ జెండా ఎల్లప్పుడూ దేశ గౌరవాన్ని పెంపొందిస్తూనే ఉంటుందని అన్నారు. అయోధ్యలోని రామమందిరంపై ప్రధాని మోదీ ధ్వజారోహణాన్ని గుర్తుచేస్తూ.. దానిని సనాతన చిహ్నంగా అభివర్ణించారు.
సంక్షోభ సమయాల్లోనే శ్రీరాముడ్ని గుర్తుచేసుకుంటారని, లేకపోతే ఆయనను మరచిపోతారని.. ఇలాంటి అవకాశవాదులను రాముడు కూడా మరచిపోయాడని సీఎం అన్నారు. రామ భక్తులపై కాల్పులు జరిపి, రాముడి లక్ష్యాన్ని అడ్డుకున్న వారికి ఇక చోటు లేదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, శాంతిభద్రతల విషయంలో యూపీ సీఎం హెచ్చరికలు చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకుని, చట్టాన్ని పాటించేవారు ప్రయోజనం పొందుతారని, లేకుంటే నరకం వైపు వెళ్తారని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా స్వర్గానికి చేరుకోగలమని నమ్మేవారి కలలు ఎప్పటికీ నెరవేరవని ఆయన అన్నారు. కాగా, మసీదు నిర్మాణ కోసం ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటయ్యింది. ఈ బోర్డు ఆధ్వర్వంలో నిధుల సేకరణ కూడా జరుగుతోంది.