|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 05:51 PM
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మరో 15 ఏళ్ల పాటు ఐక్యంగా, బలంగా కొనసాగాలని, అప్పుడే గుజరాత్ తరహాలో సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందు ఏ స్ఫూర్తితో నిలబడ్డామో, అదే ఐక్యతను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. గడిచిన 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు రాకపోవడం శుభపరిణామమని, ఇదే ఐక్యతతో పనిచేసి ఎమ్మెల్యేలు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.ఎన్నికల నాటి కంటే ఇప్పుడు కూటమిపై ప్రజా మద్దతు మరింత పెరిగిందని చంద్రబాబు అన్నారు.గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఐదుసార్లు గెలిచి అధికారంలో ఉంది. ఒకే ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగడం వల్లే అక్కడ అభివృద్ధి సాధ్యమైంది. మన రాష్ట్రంలోనూ అదే జరగాలి. మరో 15 ఏళ్ల పాటు మూడు పార్టీలు ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి రావాలి. అప్పుడే శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడగలం అని ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా శాసనసభ్యులకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు.అసెంబ్లీ సమావేశాలను ప్రతి సభ్యుడు సీరియస్‌గా తీసుకోవాలి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందరూ సభలోనే ఉండాలి. నేను కూడా సభను పూర్తిగా ఫాలో అవుతాను. సభలో సబ్జెక్టులపై అర్థవంతమైన చర్చలు జరగాలి. ఎదుటివారు తిట్టారని మనం కూడా బూతులు తిట్టకూడదు. ప్రజామోదయోగ్యంగా సభను నడుపుదాం అని అన్నారు. త్వరలోనే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గాల్లో పెండింగ్ పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్లే రాష్ట్రం వేగంగా కోలుకుంటోందని చంద్రబాబు వివరించారు.వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టామంటే దానికి కేంద్రం చేయూతే కారణం. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వకపోయి ఉంటే అవి ముందుకు కదిలేవి కావు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తున్నామంటే అది కేంద్రం సాయంతోనే. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టేందుకు కేంద్రం తన పాలసీనే మార్చుకుంది. ఫలితంగా, మొదటిసారిగా స్టీల్ ప్లాంట్ ఒక్క నెలలో రూ.54 కోట్ల లాభాలు సాధించింది. సూపర్ సిక్స్‌తో సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామంటే దాని వెనుక కేంద్రం అండ ఉంది. ఈ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి ఎమ్మెల్యే ఓన్ చేసుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నేతలు ఎదుర్కొన్న అణచివేతను చంద్రబాబు గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌ను విశాఖలో హోటల్ గదికే పరిమితం చేయడం, తన అరెస్టు సమయంలో ఆయనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం వంటి ఘటనలను ప్రస్తావించారు. అలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఐక్యంగా నిలబడి గెలిచామని, ఈ స్ఫూర్తిని ఎప్పటికీ మరువకూడదని హితవు పలికారు.
Latest News