|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:49 PM
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది. అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ పట్టాభిపురంలో నమోదైన కేసులో గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు అంబటి రాంబాబును కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను సైతం కోర్టు కొట్టివేసింది. పది వేల రూపాయల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిస్తూ అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ మంజారు చేసింది.
మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో అంబటి రాంబాబుకు ఇప్పటికే బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఈ కేసులో గుంటూరు స్పెషల్ జూనియర్ సివిల్ కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. తాజాగా పట్టాభిపురం కేసులోనూ బెయిల్ రావటంతో నేడో, రేపో అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అంబటి రాంబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించటంతో రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే ఈ కేసును విచారించిన గుంటూరు ప్రత్యేక సివిల్ కోర్టు అంబటికి బెయిల్ ఇచ్చింది. ఇదే సమయంలో పట్టాభిపురం కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు రిమాండ్ విధించటంతో అంబటి రాంబాబును మళ్లీ రాజమండ్రి జైలుకు తరలించారు. తాజాగా గుంటూరు కోర్టు కూడా బెయిల్ మంజూరు చేయటంతో జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అంబటి రాంబాబు కోర్టు బెయిల్ ఇవ్వటంతో ఆయన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ఆసక్తికర ట్వీట్ చేశారు. "దౌర్జన్యాలు,దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవు" అంటూ అంబటి రాంబాబు అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. ప్రభుత్వ విధానాన్ని, తన అరెస్టును పరోక్షంగా ప్రస్తావిస్తూ అంబటి రాంబాబు అకౌంట్ నుంచి ఈ ట్వీట్ వచ్చింది. మరోవైపు బెయిల్ ఆర్డర్స్ కోర్టు నుంచి జైలు అధికారులకు చేరిన తర్వాత ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Latest News