|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 10:00 PM
వాలెంటైన్స్ డే అంటే అందరికీ గులాబీలు, చాక్లెట్లు, ప్రేమ లేఖలు గుర్తొస్తాయి. కానీ ప్రేమలో విఫలమై, తమ మాజీ భాగస్వామి ప్రవర్తన వల్ల విసిగిపోయిన వారికి మాత్రం.. ఆ ప్రేమ తాలూకూ జ్ఞాపకాలు గుర్తొచ్చి మనుసును కకావికలం చేస్తుంటాయి. అలాంటి వారికోసమే అమెరికాలోని మేరీల్యాండ్ జూ ఒక వింతైన, వినోదాత్మకమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా మీ ఎక్స్ ప్రవర్తన మరీ కంపు కొడుతోందని మీకు అనిపిస్తే.. ఆ కోపాన్ని తీర్చుకోవడానికి జంతువుల పేడకు వారి పేరు పెట్టవచ్చని జూ యాజమాన్యం ప్రకటించింది.
మేరీల్యాండ్ జూ ఈ వినూత్న నిధుల సేకరణ కార్యక్రమానికి 'డాలర్స్ ఫర్ డంగ్' అని పేరు పెట్టింది. దీని ప్రకారం.. ఎవరైనా కేవలం 5 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.400) చెల్లించి జూలోని జంతువుల విసర్జితానికి తమ మాజీ ప్రేమికుడి లేదా ప్రేమికురాలి పేరును పెట్టవచ్చు. ఇలా పేరు పెట్టినందుకు గుర్తుగా జూ యాజమాన్యం సదరు వ్యక్తికి ఒక అధికారిక పీడీఎఫ్ ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇస్తుంది. అయితే ఈ సర్టిఫికేట్‌ను మీరు మీ సోషల్ మీడియాలో పోస్ట్ చసుకోవచ్చు లేదా నేరుగా మీ మాజీ ప్రేమికుడు లేదా ప్రేయసికి పంపి పగ తీర్చుకోవచ్చు.
ఈ వినూత్న ఐడియా గురించి జూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షానన్ బ్రౌన్ మాట్లాడుతూ.. "వాలెంటైన్స్ డే రోజున హృదయ వేదనను హాస్యంగా మార్చుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం. మీ మాజీల గురించి చెడుగా మాట్లాడే బదులు ఇలా సరదాగా పగ తీర్చుకుంటూనే జంతువుల సంరక్షణకు సహకరించవచ్చు" అని తెలిపారు. గతేడాది కూడా ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందని.. సుమారు 30 దేశాల నుంచి 10 వేల డాలర్ల వరకు విరాళాలు అందాయని ఆమె వివరించారు. ఈ మొత్తాన్ని జూలోని ఆఫ్రికన్ పెంగ్విన్లు, గోల్డెన్ ఫ్రాగ్స్ వంటి అంతరించిపోతున్న జీవుల సంరక్షణ కోసం ఉపయోగిస్తారు.
ఎక్స్ మాత్రమే కాదు.. అత్తగారి పేరు కూడా!
కేవలం మేరీల్యాండ్ జూ మాత్రమే కాదు గతంలో టెన్నెస్సీలోని మెంఫిస్ జూ కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చింది. అక్కడైతే ఏకంగా ఏనుగు విసర్జన చేస్తున్న వీడియోను 'ఎక్స్'కు పంపే అవకాశం కల్పించారు. "మీకు నచ్చని పొరుగువారు ఉన్నా, వేధించే బాస్ ఉన్నా, లేక విసిగించే అత్తగారు ఉన్నా.. ఎవరి పేరైనా ఈ విసర్జితానికి పెట్టవచ్చు" అంటూ ఆ జూ చేసిన పోస్ట్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో 'పూప్' ట్రెండ్
"Love Stinks" అనే ట్యాగ్‌లైన్‌తో సాగుతున్న ఈ క్యాంపెయిన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకర్షిస్తోంది. తమ పాత జ్ఞాపకాలను తుడిచేసుకుని.. నవ్వుతూ ముందుకు సాగాలనుకునే వారికి ఇదొక క్రేజీ థెరపీలా పని చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Latest News