|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 10:58 PM
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయపడటంతో, అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ అయిన స్టీవ్ స్మిత్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులోకి చేర్చింది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ఈ మార్పు చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో మార్ష్ గాయపడినట్లు సమాచారం. సైడార్మ్ త్రో డౌన్స్ సమయంలో గ్రోయిన్ ప్రాంతంలో తీవ్ర గాయమవడంతో వెంటనే నెట్స్ నుంచి బయటకు వెళ్లి చికిత్స పొందాడు. క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్ష్‌కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు స్కాన్లలో తేలింది. ఈ గాయం కారణంగా అతడికి కొంతకాలం విశ్రాంతి, రిహ్యాబిలిటేషన్ అవసరమని వైద్యులు సూచించారు. దాంతో ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. స్టీవ్ స్మిత్ ప్లేయింగ్ 11లో లేకపోయినా అతని పేరు మాత్రం స్క్వాడ్ లిస్ట్‌లో చేర్చారు.
“మార్ష్ ప్రస్తుతం తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. కదలికలు పరిమితం అవుతున్నాయి. పూర్తిగా కోలుకున్న తర్వాతే మైదానంలోకి దిగే అవకాశం ఉంటుంది” అని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో జట్టుకు బ్యాకప్‌గా స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేసింది. త్వరలోనే అతడు శ్రీలంకలో జట్టుతో చేరనున్నాడు. కీలక సమయాల్లో అనుభవం ఉన్న ఆటగాడిగా స్మిత్ ఎంపిక ఆస్ట్రేలియాకు ఊరటనిస్తోంది. ఇప్పటికే పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ వంటి ప్రధాన బౌలర్లు టోర్నీకి దూరమైన నేపథ్యంలో, మార్ష్ గాయం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో జట్టు నాయకత్వ బాధ్యతలు తాత్కాలికంగా ట్రావిస్ హెడ్‌కు అప్పగించింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కాన్‌లీ, బెన్ ద్వార్షుయీస్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, టిమ్ డేవిడ్, కామెరన్ గ్రీన్, ఆడమ్ జాంపా, నాథన్ ఎలిస్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టాయినీస్. ట్రావెలింగ్ రిజర్వ్‌గా షాన్ అబాట్ ఉన్నాడు.
Latest News