|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:08 PM
టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం అధికంగా వినిపిస్తున్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). అన్ని రంగాల్లోనూ శరవేగంగా విస్తరిస్తోంది. ఏఐని అందిపుచ్చుకునేందుకు చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వ్యయ నియంత్రణ, టెక్నాలజీ అప్‌గ్రేడ్ పేరుతో ఉద్యోగుల్లో కోత పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ షాకింగ్ ప్రకటన చేసింది. గూగుల్ తన ఉద్యోగులకు ఒక ఆఫర్ ఇచ్చింది. కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్ధంగా లేని వారు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి వెళ్లిపోవాలని సూచించింది. వారికి వాలంటరీ రిటైర్మెంట్ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఈ మేరకు గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ పేర్కొన్నట్లు చెబుతూ బిజినెస్ ఇన్‌సైడర్ ఓ కథనం ప్రచురించింది.
గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ లోని కొందరు ఉద్యోగులకు ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీ వర్తిస్తుందని కథనం పేర్కొంది. గూగుల్ కంపెనీలోని జీబీఓ యూనిట్ సంస్థ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన ప్రకటనలు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ ను పర్యవేక్షిస్తుంది. 2025 సంవత్సరానికి గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ రెవెన్యూ 400 బిలియన్ డాలర్లుగా ఉంది. 2026ను మెరుగ్గా ఆరంభించింది. అయినప్పటికీ ఏఐ పరిధిని విస్తరించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఏఐని అందిపుచ్చుకునే వారినే కంపెనీ కోరుకుంటున్నట్లు షిండ్లర్ పేర్కొన్నట్లు కథనం వెల్లడించింది. అమెరికాలోని కస్టమర్ సేల్స్ టీమ్స్, కస్టమర్ ఫేసింగ్ పొజిషన్స్ ఉద్యోగులకు ఈ ప్యాకేజీ వర్తించదని ఆయన తెలిపారు.
ఈ వాలంటరీ రిటైర్మెంట్ అనేది గూగుల్ ఒక్క కంపెనీకే పరిమితం కాలేదు. ఇతర టెక్ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటివి సైతం ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. మైక్రోసాఫ్ట్ తన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అల్టిమేటం ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఆయా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు గత ఏడాదిలో వేలాది మందిని తొలగించాయి. ఏఐ కార్యక్రమాలను విస్తృతం చేసే లక్ష్యంతో గూగుల్ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో నిధుల సమీకరణ కోసం అల్ఫాబెట్ జారీ చేసిన బాండ్లకు భారీ స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే రూ.2.9 లక్షల కోట్లు సమీకరించినట్లు సమాచారం.