|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 08:39 PM
ఉత్తర కొరియా రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దేశ ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా తన కుమార్తె ‘కిమ్ జు ఏ’ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ కొరియా నిఘా సంస్థ (NIS) కీలక నివేదికను విడుదల చేస్తూ, భవిష్యత్తులో ఉత్తర కొరియా పగ్గాలు ఆమె చేతుల్లోకి వెళ్లడం దాదాపు ఖాయమని విశ్లేషించింది.
గత కొద్ది కాలంగా కిమ్ జు ఏ ప్రాధాన్యత ఆ దేశంలో అసాధారణంగా పెరుగుతూ వస్తోంది. సాధారణంగా అత్యంత రహస్యంగా ఉండే కిమ్ కుటుంబ వ్యవహారాల్లో, ఆమె వరుసగా బహిరంగ వేదికలపై కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కీలకమైన సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాల సమయంలో తండ్రి పక్కనే ఆమె నిలబడటం, సైనిక ఉన్నతాధికారులు ఆమెకు ఇచ్చే గౌరవం చూస్తుంటే.. ఆమెను భవిష్యత్ నాయకురాలిగా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టమవుతోంది.
కేవలం తండ్రితో కలిసి పర్యటించడమే కాకుండా, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కూడా ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యం పెరుగుతున్నట్లు సమాచారం. దేశ అంతర్గత విషయాల్లో, వ్యూహాత్మక చర్చల్లో కిమ్ జోంగ్ ఉన్ ఆమెను భాగస్వామిని చేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఒక రకమైన అధికారిక శిక్షణ అని, ప్రజల దృష్టిలో ఆమెను ఒక శక్తివంతమైన నాయకురాలిగా ముద్ర వేసేందుకే ప్రభుత్వం ఈ తరహా ప్రచారాన్ని కల్పిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కిమ్ జు ఏ వయస్సు తక్కువగా ఉన్నప్పటికీ, ఆమెకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఉత్తర కొరియా చరిత్రలో ఇప్పటివరకు పురుషులే ఆధిపత్యం వహించగా, మొదటిసారి ఒక మహిళ దేశానికి సారథ్యం వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పరిణామం అటు దక్షిణ కొరియాతో పాటు ఇటు ప్రపంచ దేశాల్లో కూడా ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది.