కోవా బన్ వ్యాపారికి మద్దతుగా పొలిటికల్ లీడర్లు
 

by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:06 PM

కోవా బన్ వ్యవహారం.. ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. చిరు వ్యాపారికి మద్దతుగా నెటిజన్లతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు. అతనికి సంఘీభావంగా పోస్టులు పెడుతున్నారు. మద్దతు తెలుపుతున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కూడా కోవా బన్ వ్యాపారికి మద్దతు తెలిపారు. అతనికి సంఘీభావంగా తమ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు.


అసలేమైందంటే?


తెలంగాణలో మేడారం జాతర అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. జాతర సందర్భంగా పలువురు చిరు వ్యాపారులు పొట్ట కూటి కోసం స్టాళ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకున్నారు. ఈ విధంగానే ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ చిరు వ్యాపారి కూడా మేడారం జాతరలో చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకున్నారు. రూ. 10లకు కోవా బన్ విక్రయిస్తూ నాలుగు రాళ్లు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ కోవా బన్ వ్యాపారిపై ఓ యూట్యూబ్ ఛానెల్ సంధించిన ప్రశ్నలు.. ఇప్పుడు నెట్టింట ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి. ఇంత తక్కువ ధరకు కోవా బన్ ఎలా అమ్ముతున్నావ్.. ఏదైనా కలిపావా.. అంటూ యూట్యూబర్ వరుస ప్రశ్నలు సంధించారు.


తన అనుమానాలకు తోడు ఆ ట్యూబర్.. చిరు వ్యాపారి మతాన్ని కూడా లాగారు. ఈ కోవా బన్ నువ్వు తింటావా.. అంటూ ప్రశ్నలు వర్షం కురిపించటంతో ఆందోళనకు గురైన ఆ చిరు వ్యాపారి.. భయపడిపోయాడు. తాను ఎలాంటి కల్తీ చేయలేదని నిరూపించుకునేందుకు యూట్యూబర్లు ప్రశ్నిస్తున్న సమయంలోనే కోవా బన్ తిన్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు యూట్యూబ్ ఛానెల్ మీద మండిపడుతున్నారు. ఛానెల్ వ్యూస్, లైకుల కోసం కష్టపడి వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారి గౌరవాన్ని ఇలా దెబ్బతీస్తారా అంటూ మండిపడుతున్నారు. వేలాదిమంది ఆ చిరు వ్యాపారికి మద్దతుగా నిలిచారు. సొంతూరి ప్రజలు కూడా ఆ వ్యాపారికి మద్దతుగా నిలుస్తున్నారు.


కోవా బన్ వీడియో .. స్పందించిన టీడీపీ నేతలు


మరోవైపు ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ కూడా ఈ విషయం మీద స్పందించారు. ఆకలికి కులం ఉండదు, ఆత్మగౌరవానికి మతం ఉండదు, కష్టానికి పార్టీ రంగు ఉండదంటూ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి చిరు వ్యాపారికి మద్దతుగా నిలిచారు.


సోషల్ మీడియాలో తిరుగుతున్నది ఒక వార్త కాదని.. ఒక కుటుంబం పరువు అని పేర్కొన్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడటం సులువని.. కానీ ఆ వ్యక్తి వెనక ఉన్న బాధను చూడడానికి, సహాయం చేయడానికి ధైర్యం కావాలని అన్నారు. నిజ నిజాలు తెలుసుకోకుండా కష్టపడి కుటుంబం కోసం జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తిపై సొంత లాభం కోసం నిందలు వేయడం చాలా బాధాకరమంటూ ట్వీట్ చేశారు. కోవా బన్ వ్యాపారికి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతల తెలియజేసిన శబరి.. మనలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని మీరందరూ నిరూపించారంటూ ట్వీట్ చేశారు.


మరోవైపు కష్టపడి ప‌నిచేసుకొని కుటుంబాన్ని పోషించుకునే ప్రతీ ఒక్కరినీ గౌర‌వించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని పరిటాల శ్రీరామ్ అన్నారు. కోవా బ‌న్ అమ్ముకునే పేద చిరు వ్యాపారి జీవితాన్ని ఇలా రోడ్డుపైకి లాగ‌డం దారుణమని.. యూట్యూబ్‌లో వ్యూస్, లైక్స్ కోసం కొంద‌రు ఇలాంటి ప‌నులు చేస్తున్నారని మండిపడ్డారు. వీలైతే పేద వారి ప‌క్షాన నిల‌బ‌డాలి కానీ ఇలా గొంతు నొక్కడం స‌రైంది కాదన్నారు. ఆ చిరు వ్యాపారికి మ‌ద్దతుగా నిలుస్తున్న వారికి పరిటాల శ్రీరామ్ ధన్యవాదాలు తెలియజేశారు.

Latest News
Patna police's traffic advisory on key routes ahead of Bihar Cabinet expansion Wed, May 06, 2026, 01:51 PM
Three killed in early morning blaze at Bhubaneswar apartment Wed, May 06, 2026, 01:45 PM
Centre raises sugarcane FRP: Karnataka BJP sees it as relief, slams state govt over unpaid dues Wed, May 06, 2026, 01:40 PM
Congress' newly elected MLAs to meet in Thiruvananthapuram on Thursday Wed, May 06, 2026, 01:39 PM
ISI link in Punjab twin blasts suspected; aimed to create panic ahead of Op Sindoor anniversary Wed, May 06, 2026, 01:38 PM