|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:51 PM
హెరిటేజ్ ఫుడ్స్‌పై వైసీపీ, సాక్షి మీడియా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, కల్పిత కథలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి. కుటుంబరావు తీవ్రంగా విమర్శించారు. ఒక పత్రికలో ప్రచురించిన కథనం కేవలం ఫిక్షన్ రైటింగ్ అని, అందులో వాస్తవాలు లేవని ఆయన కొట్టిపారేశారు. అబద్ధపు రాతలు మానుకోకపోతే సాక్షి యాజమాన్యం అల్మారాల్లోని అస్థిపంజరాలు బయటకు వస్తాయని, జైలు గడప తొక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఏ ప్రభుత్వానికి, దేవాలయానికి నెయ్యి సరఫరా చేయలేదని కుటుంబరావు స్పష్టం చేశారు. కేవలం తమ బ్రాండ్‌పై నేరుగా వినియోగదారులకు మాత్రమే అమ్ముతుందని తెలిపారు. హెరిటేజ్ వెబ్‌సైట్ నుంచి ఒక ఫోటోను ఎడిట్ చేసి ఇందాపూర్ డైరీలో నెయ్యి తయారవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్‌కు ఒక 'కో-మాన్యుఫ్యాక్చరింగ్' యూనిట్ మాత్రమేనని అక్కడ పాలు, పన్నీర్ వంటివి తయారవుతాయని నెయ్యి ఉత్పత్తి జరగదని వివరించారు. బ్రిటానియా హిందుస్థాన్ యూనిలివర్ వంటి దిగ్గజ సంస్థలకు ఉత్పత్తులు సరఫరా చేసే సోనాయ్ డైరీపై సిండికేట్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా నెయ్యి ధరలు పెరిగాయని ఈ వాస్తవాన్ని దాచిపెట్టి రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల క్రితం ధరలతో ఇప్పటి ధరలను పోల్చి దోపిడీగా చిత్రీకరించడం అజ్ఞానమని అన్నారు.2014లో బస్తా రూ.250 ఉన్న భారతీ సిమెంట్ ధరను జగన్ రెడ్డి ఇప్పుడు రూ.430కి అమ్ముతున్నారు. అది తప్పు కానప్పుడు, డైరీ ఉత్పత్తుల ధరలు పెరగడం ఎలా తప్పవుతుంది అని ఆయన ప్రశ్నించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేయని హెరిటేజ్, సిండికేట్ ఎందుకు అవుతుందని నిలదీశారు.గత ఐదేళ్లలో రూ.600 కోట్ల ప్రభుత్వ ప్రకటనలతో నష్టాల్లో ఉన్న సాక్షిని ఎలా పోషించారో బ్యాలెన్స్ షీట్లు చూస్తే తెలుస్తుందన్నారు. దేశంలో సాక్షి కంటే ఐదు రెట్లు పెద్ద పత్రికల మార్కెట్ విలువ రూ.1500 కోట్లు ఉంటే, 2008లోనే సాక్షికి రూ.3500 కోట్ల వాల్యుయేషన్ ఎలా వచ్చింది ఇది క్విడ్ ప్రో కోమనీ లాండరింగ్ కాదా అని కుటుంబరావు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడి 'వల్లభ' నెయ్యి కూడా మార్కెట్‌లో అధిక ధరకే అమ్ముతున్నారని, దీనిపై సాక్షి ఎందుకు రాయదని ప్రశ్నించారు.
Latest News