|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 07:51 PM
2026 -27 బడ్జెట్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పోలీసులకు శుభవార్త చెప్పింది. పోలీసుల కోసం ఓ పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖలో తీసుకువచ్చిన ఆధునికీకరణ కార్యక్రమాలతో పాటుగా.. వారికి అమలు చేస్తున్న సంక్షేమ చర్యల గురించి పయ్యావుల కేశవ్ వివరించారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖలో ఉచిత బీమా కవరేజీ అందించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు రూ.20 లక్షలు నుంచి రూ.45 లక్షల వరకు ఉచితంగా బీమా కల్పిస్తారు.
ఇదే సమయంలో పోలీస్ శాఖకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరికొన్ని శుభవార్తలు కూడా అందించారు. మూడు వేల నూతన వాహనాలను ఏపీ పోలీసులకు త్వరలో అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఏపీ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్న మంత్రి.. ఇందులో భాగంగా ఏఐ ఆధారిత ప్రాజెక్టులు, స్మార్ట్ పోలీసింగ్ ల్యాబులు, సీసీటీవీ, డ్రోన్లు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఏపీలో కొత్త పోలీస్ అకాడమీ కోసం 94 ఎకరాలు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పోలీస్ అకాడమీ నిర్మాణ పనుల కోసం ఈ బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించామన్నారు. చిత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో కొత్తగా నాలుగు ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్లు ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. వీటి ద్వారా 3,920 పోస్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీలో కొత్తగా 5,757 మంది స్టైపెండరీ కేడెట్ ట్రైనీ కానిస్టేబుళ్లను నియమించామని.. వీరికి ఇచ్చే స్టైఫండ్ కూడా రూ.4,500 నుంచి 12,000కు పెంచినట్లు తెలిపారు.
పోలీసులకు ఇవ్వాల్సిన టీఏ, డీఏ బకాయిలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల కోసం రూ.500 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఈగల్ టీమ్ ద్వారా గంజాయి సాగు, అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని వెల్లడించారు. శక్తి యాప్ పేరుతో మహిళల భద్రత కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ తెస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
Latest News