|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 08:08 PM
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో మరణం సంభవించింది . ఓ ఆరేళ్ల బాలుడు విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాజమండ్రి ఘటనపై ఏపీ వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు వివరాలను కమిషనర్ వెల్లడించారు. బాధితులు పాల వ్యాపారి నుంచి గత పదేళ్లుగా పాలు పోయించుకుంటున్నారని.. కమిషనర్ వివరించారు. అయితే ఇటీవల పాల రుచిలో తేడా వచ్చిందనీ.. వాంతులతో అస్వస్థతకు గురికావటంతో ఆస్పత్రులలో చేరారని వివరించారు.
అయితే అస్వస్థతకు గురైన బాధితులు అందరూ ఒకే ప్రాంతం నుంచి రావటంతో డాక్టర్లకు అనుమానం వచ్చిందని.. అలాగే పాలు తాగటంతో ఇలా అస్వస్థతకు గురైనట్లు వారు చెప్తున్నారని ఆరోగ్య శాఖ కమిషనర్ తెలిపారు. దీంతో సుమారుగా 315 మంది నుంచి శాంపిళ్లను సేకరించి. పరీక్షలకు పంపినట్లు వీరపాండియన్ వివరించారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చేందుకు మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. అలాగే పోలీసులు, ఫోరెన్సిక్ విభాగం కూడా నమూనాలను సేకరించారని వెల్లడించారు.
అయితే రాజమండ్రి ఘటనలో అస్వస్థతకు కల్తీ పాలే కారణమా.. ఒక వేళ పాల కల్తీనే కారణమైతే, అది ఎలా జరిగిందనేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డెయిరీలో కూలెంట్ లీకేజీనే కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఆరోగ్య శాఖ కమిషనర్ తెలిపారు. కూలెంట్ ఉన్నచోట ఏమైనా జరిగిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయని.. వీటిపై అధికారుల విచారణలో పాల కల్తీ ఎలా జరిగిందనేది తెలుస్తుందని చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. మెరుగైన చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఘటన జరిగిన ప్రాంతాల పరిస్థితులను నెలరోజుల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.