|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 08:10 AM
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ తన రాజకీయ పునరాగమనాన్ని ప్రకటిస్తూ కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని రామనాథపురం జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, ఇంకా పేరు పెట్టని తన పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. శశికళ మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా మౌనంగా ఉన్నానని, ఇకపై ప్రేక్షకపాత్ర వహించలేనని స్పష్టం చేశారు.ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం కొత్త పార్టీని ప్రారంభిస్తున్నాం. ద్రోహులు, శత్రువులను కూకటివేళ్లతో పెకిలించడమే మా లక్ష్యం అని ఆమె ప్రకటించారు. తమ పార్టీ అన్నాదురై, ఎంజీఆర్ జయలలిత చూపిన ద్రావిడ మార్గంలో నడుస్తుందని, పేదలు, అణగారిన వర్గాలు, సామాన్య ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. జయలలిత మరణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ జెండాలో నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై ఎంజీఆర్, జయలలిత చిత్రాలు ఉన్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిపై శశికళ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు.నేనే అతడిని సీఎం చేశాను. కానీ నన్ను ఓ కాగితంలా విసిరిపారేశారు. అలాంటి వ్యక్తి ఎలాంటివాడో ఊహించుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి జెండాను మాత్రమే పరిచయం చేస్తున్నానని త్వరలోనే పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని శశికళ స్పష్టం చేశారు. కాగా, అక్రమాస్తుల కేసులో శిక్ష పడటంతో శశికళ 2027 వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలన్న విషయం తెలిసిందే.
Latest News