|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:29 PM
మార్కాపురం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తూమటి మాధవరావు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోసిందే వైయస్సార్ కుటుంబమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు ప్రతి అడుగులోనూ వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ ముద్ర ఉందని ఆయన స్పష్టం చేశారు. 2004 అక్టోబరు 27న దివంగత నేత వైయస్సార్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, రూ.3581 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుడితే... 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. తిరిగి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి రెండు సొరంగాలను పూర్తి చేసిన మార్చి 6, 2024న జాతికి అంకితం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ (సహాయ పునరావాస) ప్యాకేజీ ఇవ్వకుండా.. ప్రాజెక్టు పూర్తైందని ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు. సహాయ పునరావాస ప్యాకేజీలో భాగంగా ఇళ్లు కోల్పోయిన 7300 కుటుంబాలకు రూ.1000 కోట్లు అవసరం కాగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి డీఆర్సీ సమావేశంలో ఆర్ అండ్ ఆర్ ఎప్పుడిస్తారని మేము అడిగితే 2-3 నెలల్లో చెల్లిస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా... నేటికీ వారికి పరిహారం అందలేదని నిలదీశారు. మరోవైపు నిర్వాసితులకు పరిహారం పూర్తిగా చెల్లించామన్న చంద్రబాబు మాటలు పచ్చి అబద్ధమని.. నిజంగా చెల్లిస్తే ప్రాజెక్టును ప్రారంభించకుండా, కేవలం కెనాల్‌ను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు.
Latest News