|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 09:22 PM
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక మార్పులు తీసుకురానుంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కఠిన నిబంధనలను అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది.ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి “గ్రేడింగ్ పాయింట్ల” విధానం అమల్లోకి రానుంది. అంటే ప్రతి డ్రైవింగ్ లైసెన్స్‌కు నిర్దిష్ట పాయింట్లు కేటాయిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిసారి ఆ పాయింట్లు తగ్గిస్తారు. అన్ని పాయింట్లు కోల్పోతే, డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలపాటు సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.గురువారం జరిగిన సీఐఐ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి Nitin Gadkari ఈ ప్రతిపాదిత విధానం గురించి వివరించారు. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల గౌరవం, భయం తగ్గిపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
*డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ఎలా? : కొత్త విధానం ప్రకారం, ప్రతి ఉల్లంఘనకు అనుగుణంగా పాయింట్లు కట్ అవుతాయి. వరుసగా తప్పిదాలు చేస్తూ అన్ని పాయింట్లు కోల్పోతే, సంబంధిత అధికారులకు లైసెన్స్‌ను సస్పెండ్ లేదా రద్దు చేసే అధికారం ఉంటుంది. ఈ వ్యవస్థను త్వరలో అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
*రోడ్డు ప్రమాదాలపై ఆందోళన :దేశంలో ప్రతి ఏడాది సుమారు 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి వెల్లడించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవ్ చేయడం వంటి కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, అందుకే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.